Abn logo
Nov 29 2020 @ 00:50AM

ప్రాణంతీసిన పొగ.. ఊపిరాడక బాలుడి మృతి

పెద్దపంజాణి, నవంబరు 28 : బొగ్గుల కుంపటి పొగతో ఊపిరాడక ఓ బాలుడు మృతిచెందాడు. సంఘటన శనివారం పెద్దపంజాణి మండలం నేలపల్లె సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో జరిగింది. ఎస్‌ఐ. మల్లిఖార్జునరెడ్డి కథనం మేరకు.. నేలపల్లె సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో బట్టందొడ్డి గ్రామానికి చెందిన శైలజ, పురుషోత్తం, వీరి కుమారుడు హరి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శైలజ తమ్ముడు రెడ్డెప్ప(11) శుక్రవారం అక్కాబావలను చూడడానికి వచ్చాడు. శుక్రవారం రాత్రి చలి ఎక్కువగా ఉండడంతో ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రపోయారు. కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేసి ఉండడంతో పొగ ఇంటిని కమ్మేసింది. అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుంపటి పక్కనే పడుకుని ఉన్న రెడ్డెప్ప ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటి నుంచి పొగలు రావడాన్ని శనివారం ఉదయం యజమాని గుర్తించాడు. స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి అపస్మారక స్థితిలో ఉన్న హరి, శైలజ, పురుషోత్తంలను 108 సాయంతో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెడ్డెప్ప మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement