దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-01-14T11:56:09+05:30 IST

దొంగతనం కేసులో నిందితుడిని అల్వాల్‌ పోలీసులు అరెస్ట్‌

దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్‌

  • 6 తులాల బంగారం, 30 తులాల వెండి స్వాధీనం

హైదరాబాద్/అల్వాల్‌ : దొంగతనం కేసులో నిందితుడిని అల్వాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ జేమ్స్‌ బాబు బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, గోఖుల్‌పూరా, శరణ్‌సింగ్‌ ప్రాంతానికి చెందిన నీరజ్‌ శర్మ(31), 2003 నుంచి హస్మత్‌పేట్‌ అంజయ్యనగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ స్థానికంగా క్యాటరింగ్‌ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సాయి శర్మ స్థానికంగా ఉన్న ఆలయంలో అర్చకుడిగా ఉన్నాడు. కాగా ఈనెల 8న సాయి శర్మ కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లాడు. నిందితుడు నీరజ్‌ శర్మ ఇల్లు కూడా అర్చకుడు సాయి శర్మ నివాసానికి సమీపంలోనే ఉంది. 


11వ తేదీన ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో కాలనీ వాసులు సాయిశర్మకు ఫోన్‌ ద్వారా విషయాన్ని తెలిపారు. అతడు లంగర్‌హౌజ్‌లో ఉండే తన అత్త కావడి సుమలతకు విషయం చెప్పడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈనెల 12న గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నీరజ్‌ శర్మను విచారించారు. దాంతో సాయి శర్మ ఇంట్లో దొంగతనం చేసినట్లు అతడు అంగీకరించాడు. అతడి నుంచి 6 తులాల బంగారం, 30 తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-14T11:56:09+05:30 IST