చైన్‌ స్నాచింగ్‌కు విఫలయత్నం.. ఒకరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-04-13T12:10:43+05:30 IST

ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ ప్రైవేట్‌ పాఠశాల కరస్పాండెంట్‌

చైన్‌ స్నాచింగ్‌కు విఫలయత్నం.. ఒకరి అరెస్ట్‌

హైదరాబాద్/రామంతాపూర్ ‌: ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ ప్రైవేట్‌ పాఠశాల కరస్పాండెంట్‌ మెడలో నుంచి గర్తు తెలియని వ్యక్తి చైన్‌ స్నాచింగ్‌కు యత్నించాడు.  దుండగులలో ఒకరిని దారిగుండా ఆటోలో వెళుతున్న ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరొకరు పరారైన ఘటన సోమవారం రామంతాపూర్‌లో సంచలనం రేకేత్తించింది.


ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రామంతాపూర్‌ గాంధీనగర్‌లో విశ్వశాంతి విద్యానికేతన్‌ పాఠశాల కరస్పాండెంట్‌ రూపారాణి (45)  సోమవారం  ఉదయం  7.15 నిమిషాల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లింది.  చర్చి కాలనీకి వెళ్లే రోడ్డు గుండా గాంధీనగర్‌లోని ఇంటి వైపునకు నడుచుకుంటు వెళ్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఒకడు బైక్‌పై ఆమెను దాటుకుని ముందుకు, మరొకడు నడుచుకుంటూ రూపారాణిని కొద్ది దూరం వరకు వెంబడించారు.  రోడ్డు నిర్మానుష్యం కాగానే దుండగుడు ఆమె మెడలో నుంచి చైన్‌ (మంగళ సూత్రాన్ని) లాగేందుకు విఫలయత్నం చేశారు.


ఈ క్రమంలో కింద పడిన సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగుడు చైన్‌ను వదలకుండా ఆమెను కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో గట్టిగా అరిచింది. దీంతో అటుగా వెళ్తుతున్న మహిళలు దుండగుడిని అడ్డగించినప్పటికీ వారిని నెట్టివేసి చైన్‌ స్నాచింగ్‌కు మళ్లీ యత్నించాడు. మెడలోని చైన్‌ను విడిచి పెట్టకుండా గట్టిగా పట్టుకున్న రూపారాణితో పాటు ఇతర మహిళలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా ఆటోలో వెళుతున్న ప్రయాణిలు దుండగుడిని పట్టుకుని ఉప్పల్‌ పోలీసులకు అప్పగించారు. ఇదంతా దూరం నుంచి గమనించిన మరో దుండగుడు బైక్‌పై పరారయ్యాడు. ఘటనలో తలకు గాయమైన రూపారాణి అస్వస్థతకు గురైంది.

Updated Date - 2021-04-13T12:10:43+05:30 IST