ఒక్క వారంలో 1.45 లక్షల కేసులు..

ABN , First Publish Date - 2020-04-01T17:22:56+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే...కొన్ని అత్యవసర రంగాల ఉద్యోగుల వాహనాలు మినహా రోడ్లపైకి రావొద్దని ఎంత మొత్తుకున్నా కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. ఆకతాయిలు ఖాళీగా ఉన్న రోడ్లపైకి వచ్చి వాయువేగంతో దూసుకెళుతున్నారు. పోలీసుల కంటపడకుండా

ఒక్క వారంలో 1.45 లక్షల కేసులు..

వారంలో వాహనదారులపై నమోదు

లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసి...

ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చినందుకు...


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే...కొన్ని అత్యవసర రంగాల ఉద్యోగుల వాహనాలు మినహా రోడ్లపైకి రావొద్దని ఎంత మొత్తుకున్నా కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. ఆకతాయిలు ఖాళీగా ఉన్న రోడ్లపైకి వచ్చి వాయువేగంతో దూసుకెళుతున్నారు. పోలీసుల కంటపడకుండా, ఒకవేళ పడినా ఏదో వంక చెప్పి జారుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో సిగ్నల్స్‌ కూడా ఆపేయడంతో ట్రాఫిక్‌ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపడానికి రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. మరికొన్నిచోట్ల వాహనాలను సీజ్‌ చేసి, కేసులు నమోదు చేసి ఈ-చలానాలు విధించారు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ల పరిధిలో వారం రోజుల్లోనే 1,45,934 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయంటే వాహనదారులు ఏ స్థాయిలో రోడ్ల మీదకు వచ్చి నిబంధనలు అతిక్రమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఖ్య సాధారణ స్థాయిలో లక్షలాది వాహనాలు రోడ్డుపై తిరుగుతున్న సమయంలో నమోదవుతున్న ఉల్లంఘన కేసులకు దగ్గరగా ఉండటం గమనార్హం. 


ఒక్కో వాహనంలో ముగ్గురు...

కొన్ని ప్రాంతాల్లో మైనర్లు, ఆకతాయిలు పోలీసుల కళ్లుగప్పి ద్విచక్ర వాహనాలపై రోడ్డుపైకి వస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో వాహనంపై ముగ్గురు, నలుగురు యువకులు తిరుగుతున్నారు. రాంగ్‌రూట్లో వెళుతుండడంతో పాటు యూటర్న్‌ల వద్ద ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారు. 


అత్యుత్సాహంలో పోలీసులు !

కొన్నిచోట్ల పోలీసులు ఇష్టానుసారంగా వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక శాతం కేసులు పోలీసులు అత్యుత్సాహంతో నమోదు చేసినవేనని వాహనదారులు ఆరోపిస్తున్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు ఉన్న వాహనదారులపై వివిధ కారణాలను సాకుగా చూపి కేసులు నమోదు చేస్తున్నారని వారు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని, ఒకే వాహనం నగరంలో పలుచోట్ల కనిపిస్తే కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎక్కువ వాహనాలు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన అత్యవసర సేవల్లో భాగంగా ఉద్యోగాలు చేస్తున్నవారివి ఉన్నాయి. అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని, వేసిన చలానాలు రద్దు చేయాలని బాధితులు కోరుతున్నారు. వారిలో ఐటీ ఉద్యోగులు, ఫార్మా, మీడియా, మెడికల్‌, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వాహనదారులు ఉన్నారు.

Updated Date - 2020-04-01T17:22:56+05:30 IST