మరోసారి పోతిరెడ్డిపాడు

ABN , First Publish Date - 2020-05-26T09:14:48+05:30 IST

తెలుగు ప్రజలమంతా ఒకటి కావటం అనే భావోద్వేగంలో ప్రవహించింది ప్రధానంగా నీళ్ళే. నీళ్ళేనని నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణంతోనే తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందు తెలంగాణ...

మరోసారి పోతిరెడ్డిపాడు

మనం ఇప్పుడు తీవ్రమైన కరోనా విపత్తులో ఉన్నాం. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న దుఃఖంలో ఉన్నాం. కోట్లాది మంది పాదాలు నెత్తుర్లు కారుతుండగా, బలహీనమైపోయి మార్గమధ్యంలోనే పలు విధాలుగా అనేక బరువులతో నడుస్తూండటం, ప్రాణాలు కోల్పోవటం చూస్తూ చాలా బాధలోనూ దైన్యంలోనూ ఉన్నాం. ఇలాంటిలాంటి బాధలన్నీ చుట్టుముట్టిన ఎగువ ప్రాంతాల బీడు భూముల రైతాంగాన్ని ఎవరు కాపాడతారు?


తెలుగు ప్రజలమంతా ఒకటి కావటం అనే భావోద్వేగంలో ప్రవహించింది ప్రధానంగా నీళ్ళే. నీళ్ళేనని నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణంతోనే తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్రంలో మైసూరు, హైదరాబాదు రాజ్యాల మధ్య నడిచిన ఒప్పందాలున్నాయి. అట్లాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను జరిగిన ఒప్పందాలున్నాయి. ఈ అన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తుంగలో కూడా కనిపించనంత లోతుకు తొక్కేసింది. 


ఆంధ్ర విద్రోహం వల్ల రాయలసీమకు అన్యాయం జరిగిందని కుమిలిపోతూండిన సీమ ప్రజలకు శ్రీశైలం కుడి కాలువ కలిసి వచ్చిన వరమైంది. మద్రాసు కోసం జరిగిన తాగునీటి ఒప్పందం వల్ల తెలుగు గంగ కాలువల తవ్వకాలతో ఒక దారి పడింది. అందులో నించి గాలేరుగనరి, హంద్రీనీనా వంటి ఎత్తిపోతల పథకాలు పుట్టుకొచ్చాయి. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పాలనలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నాలుగు టిఎంసి నీరు తరలించేదిగా విస్తరించింది. దానినే రాజశేఖర్‌రెడ్డి తనయుడు రెట్టింపు చేయబోతున్నాడు. అందుకోసమే 203 జీవో తెచ్చాడు. నిధులూ కేటాయించాడు. ఇక పనులే జరగాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు ముందే నీటి రుచి తెలిసిన వారు కనుక, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ నీటిని, అనుభవంలోకి తెచ్చుకుని హక్కుగా మలుచుకున్నారు గనుక నీళ్ళ రాజకీయాలు ‘ఆంధ్ర ప్రదేశ్‌’ వాళ్ళకు తెలిసినంతగా తెలంగాణ వాళ్ళకు తెలియవు.


అందుకు రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి కరడుగట్టిన, కర్మ సిద్ధాంతం, ఒంటబట్టిన మూర్ఖ భూస్వామ్య మనస్తత్వం కాగా రెండోది ప్రాధాన్యతలు తెలియని, స్వతంత్రంగా ఆలోచించలేని, బాధిత ప్రజల కనీస గౌరవం పట్టని అహంభావ మనస్తత్వం. ఈ ఆరేండ్లు తెలంగాణ పాలకులు ప్రతిపక్షాలు ఏం చేసినట్టు? ఎదుటి వారి అతి తెలివికి బలవుతున్నామని కదా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. జీవనదిలా నిరంతరం కొనసాగుతూ ఉండిన తెలంగాణ పోరాటం కృష్ణానదీ జల సాధన ఉద్యమాలలోంచి, రైతాంగపు కన్నీటి త్యాగాలలోంచి, రైతుబిడ్డల బలిదానాలలోంచి ఉవ్వెత్తున ఎగిసి పడిందనే విషయాన్ని చాలా కన్వీనియంట్‌గా వదిలేశాం. విషాదమేమంటే తెలంగాణ తన ఆత్మను తాను కోల్పోతున్నదా? తెలంగాణ సాధనను వ్యక్తుల ప్రతిభావ్యుత్పత్తుల విశేషంగా మాట్లాడుకుంటున్నాం. ఈ అన్నిటి పరిణామాలలోంచి మనం 203 జీఓ రాకడను అర్థం చేసుకోవాలి. ఈ జీవో రావటం వెనుక ఆంధ్రప్రదేశ్‌ కృషి ఎంతున్నదో తెలంగాణ దోహదం అంతున్నది. రాయలసీమ పోరాటమూ అంతున్నది. తెలంగాణ తెలివితో నడుచుకుని ఉంటే ఈ జీఓ ఆంధ్రప్రదేశ్‌ అంతర్గత వైరుధ్యాల వ్యవహారంగా మిగిలి ఉండేది. అలా కానందునే ఇది తెలంగాణకూ చుట్టుకున్నది.


సహేతుకమైన న్యాయదృష్టితో పరిశీలిస్తే ఈ జీవో తెలంగాణకు చాలా అన్యాయం. ఇది ఎక్కడ మొదలైంది? ఉమ్మడి మద్రాసు, మైసూరు, హైదరాబాదు రాజ్యాల నాటి ఒప్పందాల మేరకైయితే కె.సి. కాలువకు ఎంత నీరో ఆర్డీఎస్‌కు అంత నీరు కేటాయించాలి. కానీ సగానికి పైగా తగ్గించారు. అయినా అడిగిన వాళ్లు లేరు. ఆర్డీఎస్‌ నాశనమైంది. సుంకేశుల అధునాతన ప్రాజెక్టయింది. సుంకేశుల దగ్గర తుంగభద్ర ఆగిపోతుంది. ఈ నాయకులే ఈ దుస్థితి కలిగించారు. స్థానిక రైతులే కాదు ఆర్డీఎస్‌ కాలువల కిందికి ఎదురెక్కి వచ్చిన వాళ్ళు కూడా వలసబాట పట్టారు. జూరాల పూర్తి కావటానికి ఇరవై యేండ్లు పట్టింది. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణ కాలాన్ని మించిన కాలం. ఇట్లా ఎందుకు జరిగింది? జస్టిస్‌ బచావత్‌ తీర్పులో మహబూబ్‌నగర్‌ జిల్లాకు అన్యాయం జరిగిందని, ఈ జిల్లా అప్పర్‌ కృష్ణ, భీమ ప్రాజెక్టులు కోల్పోయిందని తీవ్రమైన చర్చ జరిగిన క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భీమా ప్రాజెక్టు పేరున ఇరవై టిఎంసి నీరు కేటాయించింది కానీ పనులు చేపట్టటానికే ఇరవై ఐదేండ్లు తీసుకుంది.


ఎట్టకేలకు దాన్ని రెండు ముక్కలు చేసి 2005లో పనులు ప్రారంభించారు. 2013లో నీరివ్వటం ప్రారంభించారు. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలదీ ఇదే గతైంది. ఆనాడు కరువు వ్యతిరేక పోరాట కమిటీ పూనిక వహించి జలసాధన సమన్వయ సమితి ఏర్పరచి అనేక పోరాటాలు నడుపగా కల్వకుర్తి, నెట్టంపాడు పథకాలు కూడా చేపట్టారు. నీటి విడుదల 2013లో కానీ మొదలు కాలేదు. తెలంగాణలో ఎగువకు ఎత్తిపోసుకునే నీటి పథకాలను 90 రోజులలో నీరు తీసుకునే విధంగా డిజైన్‌ చేయగా ఆంధ్ర పథకాలకు 30 రోజులలో నీరు తీసుకునే విధంగా డిజైన్‌ చేశారు. ఇది అన్యాయం అని మొత్తుకున్నాం. ఈ మాత్రం సాధించుకున్నదే ఘనత అన్నారు నేతలు. ఒక్కొక్క పథకాన్ని సాధించుకోవటానికి తెలంగాణ అంతటి పోరాటం చేయవలసి వచ్చింది. 


తెలంగాణ వచ్చిన తరువాత ఈ పరిస్థితిలో మార్పు రావాలి కదా, రాలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతుండగానే 2000 సంవత్సరంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు గడువు ముగిసింది. జస్టిస్‌ బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ నియామకమైంది. ఈ ట్రిబ్యునల్‌ తుది తీర్పు తెలంగాణకు, కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాంత రైతాంగానికి చేసిన మేలేమీ లేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ట్రిబ్యునల్‌ పరిశీలనలోనే లేదు. వివిధ కారణాలతో ఈ తీర్పు ఇంకా అమలు దాకా రాలేదు. నిజంగా న్యాయ సాధనకు నిలబడి ఉంటే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది నీటి సాధన మీద కేంద్రీకరించాలి. కానీ అలా జరుగలేదు. తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యతలు ప్రభుత్వ ప్రాధాన్యతలు కాకుండా పోయాయి. అనవసరమైన వ్యర్థమైన మార్పు చేర్పులతో, నష్టకరమైన ప్రతిపాదనలతో విలువైన కాలం గడిచిపోయింది. ఇది కూడా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను, సూచనలను పట్టించుకోని పరాయికాలమైపోయింది.


౨03 జీఓ పూర్వాపరాల చర్చతో చెప్పదలచుకున్నదేమిటంటే దీనితో రెండు ప్రాంతాలలోను పార్టీల మధ్య నేతల మధ్య కొంత రచ్చ జరుగుతుంది. ప్రజల దగ్గర సమస్యకు పరిష్కారం ఉన్నా, జూరాల ఆధారంగా తన వాటా నీరు తీసుకోవచ్చునని చెప్పినా కృష్ణానది వరద తెలంగాణ ప్రభుత్వానికి కనిపించదు. నాయకులు, పార్టీలు జీఓ ౬9 వంటి తప్పుడు జీఓల వెంట పరుగులు తీస్తారు. మనం ఇప్పుడు తీవ్రమైన కరోనా విపత్తులో ఉన్నాం. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న దుఃఖంలో ఉన్నాం. కోట్లాది మంది పాదాలు నెత్తుర్లు కారుతుండగా, బలహీనమైపోయి మార్గమధ్యంలోనే పలు విధాలుగా అనేక బరువులతో నడుస్తూండటం, ప్రాణాలు కోల్పోవటం చూస్తూ చాలా బాధలోను దైన్యంలోనూ ఉన్నాం. ఇలాంటిలాంటి బాధలన్నీ చుట్టుముట్టిన ఎగువ ప్రాంతాల బీడు భూముల రైతాంగాన్ని ఎవరు కాపాడతారు? జాషువాగారన్నట్టు ‘వానినుద్దరించు భగవంతుడే లేడు, మనుజుడేల వాని గనికరించు’. ఇక పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ఎగువ ప్రాంత రైతాంగం 203 జీఓతో చేపట్టే పనులలోను పాల్గొనటానికి వలసపోతారు. నమ్ముకున్నందుకు నమ్మినంతా అయిందనుకుంటారు. చెడగొట్టేవాళ్ళకి అంత దూరపు చూపుండటం కష్టం. అలాంటి వారు పశ్చాత్తాప పడటం మరీ కష్టం. (జీవన పోరాటాలలో రాటుదేలిన, సాగునీటికి నోచుకోని ఎగువ ప్రాంత బాధిత రైతాంగానికి ఈ వ్యాసం అంకితం.)

ఎం. రాఘవాచారి

పాలమూరు అధ్యయన వేదిక


Updated Date - 2020-05-26T09:14:48+05:30 IST