Omicron ఎఫెక్ట్.. విమానయానం కుదేల్!

ABN , First Publish Date - 2022-01-10T13:05:16+05:30 IST

కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలై, ఇప్పుడిప్పుడే కాస్త కుదురుకుంటున్న విమానయానరంగం మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ విజృంభణతో కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వాలు సైతం నిబంధనల్ని కఠినతరం చేయడంతో, ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.

Omicron ఎఫెక్ట్.. విమానయానం కుదేల్!

మళ్లీ సంక్షోభంలోకి విమానయానం

ఈ నెలలోనే శంషాబాద్‌లో సగటున 10 వేల మంది ప్రయాణికుల తగ్గుదల

(రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలై, ఇప్పుడిప్పుడే కాస్త కుదురుకుంటున్న విమానయానరంగం మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ విజృంభణతో కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వాలు సైతం నిబంధనల్ని కఠినతరం చేయడంతో, ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.  శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ప్రయాణికుల రద్దీ తగ్గుముఖం పట్టింది. గత నెలతో పోలిస్తే రోజూవారీ ప్రయాణికుల సంఖ్య సగటున 10వేల మందికిపైగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కరోనాకు ముందు హైదరాబాద్‌ నుంచి సగటున రోజుకు 60వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కరోనా విజృంభణ తర్వాత గత నెల(నవంబరు)లోనే ప్రతి రోజూ సగటున 48,477 మంది రాకపోకలు సాగించారు. నవంబరు నెల మొదటి రెండు వారాల్లో రికార్డుస్థాయిలో సగటున 50వేల మందికిపైగా ప్రయాణించారు.


అయితే, ఒమైక్రాన్‌ విజృంభణతో డిసెంబరు ఆరంభం నుంచి విమాన ప్రయాణికుల రద్దీ మళ్లీ తగ్గింది. ఈనెల 6న హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి 42వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. శుక్ర, శని వారాల్లో ఈ సంఖ్య మరింత తగ్గింది. ఈ మేరకు నవంబరుతో పోలిస్తే సగటు 10వేల మంది ప్రయాణికులు తగ్గారు.  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం నాటికి 24 గంటల ముందు నుంచి 19 విమాన సర్వీసులు పలు కారణాలతో రద్దయ్యాయు. వీటిలో 11 విమానాలు హైదరాబాద్‌కు రావాల్సినవి కాగా.. 8 విమానాలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవి ఉన్నాయి. కేసులు వేగంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌కు ముందు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు తిరిగి పూర్వస్థితికి చేరాయి. తాజాగా ఇటలీ నుంచి వచ్చిన రెండు విమానాల్లో దాదాపు 75శాతం మంది ప్రయాణికులకు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముప్పు ఎక్కువ ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే వారందరూ తప్పనిసరిగా వారం పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.


కొవిడ్‌ ఉధృతంగా ఉన్న దేశాలివేకొవిడ్‌ ఉధృతంగా ఉన్న దేశాలను కేంద్రం ఇటీవల ఎట్‌ రిస్క్‌ దేశాలుగా పరిగణిస్తూ, ఆయా దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో ఐరోపా దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, యూకే, బ్రెజిల్‌, బోట్స్‌వానా, చైనా, ఘనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌, కాంగో, ఇథియోపియా, కజికిస్తాన్‌, కెన్యా, నైజీరియా, ట్యూనిషియా, జాంబియా దేశాలు ఉన్నాయి.

Updated Date - 2022-01-10T13:05:16+05:30 IST