మరోసారి ట్రంప్‌పై దుమ్మెత్తిపోసిన ఫౌసీ !

ABN , First Publish Date - 2021-01-23T22:27:15+05:30 IST

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ప్రభుత్వ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విభాగంపై దుమ్మెత్తిపోశారు.

మరోసారి ట్రంప్‌పై దుమ్మెత్తిపోసిన ఫౌసీ !

వాషింగ్టన్: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ప్రభుత్వ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విభాగంపై దుమ్మెత్తిపోశారు. మహమ్మారి కరోనా నియంత్రణ చర్యల్లో ట్రంప్ ప్రభుత్వం నిజాయితీగా లేకపోవడమే భారీ సంఖ్యలో అమెరికన్ల ప్రాణాలు పోవడానికి కారణమైందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో కరోనా విజృంభణ తారస్థాయిలో ఉన్న సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా అలసత్వం ప్రదర్శించిందన్నారు. పాజిటివ్ కేసులు, మరణాలు, ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగి సంక్షోభం చుట్టుముట్టిన సమయంలో కూడా ట్రంప్ మతిలేని మాటలు, చేతలతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇవాళ అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకుంది. ఆయన అలసత్వం 4లక్షల మంది అమెరికన్ల ప్రాణాలు పోవడానికి కారమణమైందని ఫౌసీ మండిపడ్డారు. 


వ్యాధులు ప్రబలిన సమయంలో వాటిపై అవగాహన లేనప్పుడు పరిశోధకుల సూచనలు తీసుకోవాలి. వారు సూచించిన నియంత్రణ చర్యలను పాటిస్తే సంక్షోభం నుంచి బయటపడే వీలు ఉంటుంది. కానీ, ట్రంప్ కరోనా విషయంలో పరిశోధకుల సూచనలను బేఖాతర్ చేయడమే కాకుండా వారిని పిచ్చొళ్లుగా చూశారని ఫౌసీ దుయ్యబట్టారు. సంక్షోభ సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెరికా విషయంలో అదే జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, కొత్త అధ్యక్షుడు బైడెన్ మహమ్మారిపై పోరులో పక్కా ప్రణాళికతో ఉన్నారని, ప్రస్తుతం పరిశోధకులు ఆయనతో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర విషయాలను చర్చించే వీలు ఏర్పడిందని ఫౌసీ చెప్పారు. అటు జో బైడెన్ కూడా ముందు చెప్పినట్లే బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే మహమ్మారిపై వార్ ప్రకటించారు. దేశానికి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్, మాస్కు తప్పనిసరి చేశారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. 

Updated Date - 2021-01-23T22:27:15+05:30 IST