అమ్మఒడితో ఆటలు! మళ్లీ భారీ కోత.. అమ్మలకు దక్కేది ఎంతో తెలుసా!

ABN , First Publish Date - 2022-05-21T16:28:52+05:30 IST

కుటుంబంలో బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్‌ గొప్పగా ప్రకటించారు. దీంతో తల్లులందరూ వైసీపీకి ఓట్లు వేశారని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో చెప్పారు...

అమ్మఒడితో ఆటలు! మళ్లీ భారీ కోత.. అమ్మలకు దక్కేది ఎంతో తెలుసా!

ఇక మినహాయంపు రూ.2 వేలు

గత ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి 

ఈ ఏడాది ఏకంగా 2 వేలు.. అమ్మలకు దక్కేది 13 వేలే

పథకం సొమ్ము తగ్గింపు.. లబ్ధిదారుల సంఖ్యా కుదింపు

ఎన్నికలప్పుడు 15 వేల హామీ.. ఇద్దరు చిన్నారులు ఉన్నా ఓకే

గద్దెనెక్కాక ఒక్కరికే అమలు.. 

దీనికోసం మద్యం ధరల పెంపు 

పలు కీలక పథకాల నిలిపివేత


అనేక విద్యా పథకాలను రద్దుపద్దులోకి చేర్చి అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’కి సర్కారు మరోసారి కోత పెట్టింది. మరుగుదొడ్ల నిర్వహణ పేరిట గతంలో వెయ్యి తగ్గించిన సర్కారు... ఈసారి ఆ కోతను రెండు వేలకు పెంచింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): కుటుంబంలో బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లి(mother)కీ ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్‌(CM Jagan‌) గొప్పగా ప్రకటించారు. దీంతో తల్లులందరూ వైసీపీ(ycp)కి ఓట్లు వేశారని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో చెప్పారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరం నుంచి కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. అంతేకాదు.. ఇచ్చే మొత్తంలోనూ రెండో ఏడాది నుంచి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి 14 వేలు చేతిలో పెట్టారు. ఇక, ఇప్పుడు రూ.2000 తగ్గించి పథకాన్ని రూ.13 వేలకు కుదించారు. ఈ 2 వేలను పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగించాలని సర్కారు నిర్ణయించింది. వాస్తవానికి పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణకు సర్కారే నిధులు కేటాయిస్తుంది. అయితే, వైసీపీ హయాంలో నిధులు ఇవ్వడం ఆపేసి ‘అమ్మఒడి’ నుంచి మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మినహాయిస్తున్నారు. దీంతో అమ్మఒడి పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులైన అమ్మలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


అమ్మఒడితో ఆటలు!

అమ్మఒడి పథకంతో సర్కారు ఆటలాడుతోందనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అమలు చేయాల్సి ఉంది. అయితే.. నెలలు మార్చి.. ప్రభుత్వం దీనిని నాలుగేళ్లకే పరిమితం చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో తొలి రెండేళ్లపాటు జనవరి నెలలో అమ్మఒడిని ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఆరు నెలలు ముందుకు జరిపి.. జూన్‌కు వాయిదా వేసింది. ఎందుకంటే 2022 జూన్‌లో ఇస్తే.. మళ్లీ 2023 జూన్‌లో ఇవ్వాలి. ఇక, 2024 మే నెలలోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఏడాది ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉండదని సర్కారు ప్లాన్‌ వేసుకుంది. అలాకాకుండా జనవరిలోనే అమ్మఒడి ఇచ్చి ఉంటే.. 2023, 2024లోను జనవరిలోనే ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని భావించి, ఎన్నికలకు ముందు అప్పులు చేస్తే బద్నాం అవుతామనే వ్యూహంతో ఏకంగా ఒక సంవత్సరం పథకాన్ని పక్కన పెట్టేసే ప్లాన్‌ చేసింది.


ఆది నుంచీ మాటమార్చుడే

2019 ఎన్నికలకు ముందు అమ్మఒడి విషయంలో తొలుత ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ అమ్మఒడి ఇస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ ప్రచారం మహిళల్లోకి బాగా వెళ్లాక.. ‘ఇంటికి ఒక్కరికే’ అని సవరణ చేశారు. అది ఎంతమందికి చేరిందో తెలీదు కానీ.. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తారని భావించిన తల్లులందరూ వైసీపీకి ఓట్లేశారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, అధికారంలోకి వచ్చాక అమ్మఒడి పథకం ఇచ్చేందుకు మద్యం ధరలు భారీగా పెంచారు. తద్వారా వచ్చే ఆదాయంతో ఈ పథకాన్ని అమలు చేశారు. దీంతో అమ్మఒడి కోసం నాన్న బుడ్డి పెంచేశారనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఆ తర్వాత గత ప్రభుత్వాల కాలం నుంచి ఇస్తున్న పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపేశారు.


గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘విదేశీ విద్యోన్నతి’ పథకాన్ని పక్కన పెట్టారు. మొత్తంగా అమ్మఒడి పేరు చెప్పి.. పలు కీలక పథకాలకు కోత పెట్టారు. మరోవైపు అమ్మఒడి కోసం మద్యం ధరలు పెంచి కాసులు పిండారు. అమ్మఒడి కోసం అదనపు ఆదాయం ప్రజల నుంచే వసూలు చేసి.. మరోవైపు అనేక పథకాలు ఎత్తేసి కూడా.. అమ్మఒడికి ఇచ్చే మొత్తంలో కోత పెట్టడంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. 


ఒక్కరే ఉన్నా ఇవ్వట్లేదు!

ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామన్న జగన్‌.. తర్వాత దీనిని ఒక్కరికే పరిమితం చేశారు. అయితే.. ఇప్పుడు ఒక్క చిన్నారి ఉన్న తల్లికి కూడా చాలా మందికి ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా దరఖాస్తులు చేసుకుంటున్న వారిలో వివిధ కారణాలు చెబుతూ వేల సంఖ్యలో దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని.. దాదాపు ఐదారు లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారంటున్న ప్రభుత్వం అ మేరకు అమ్మఒడి లబ్ధిదారులను పెంచడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 



Updated Date - 2022-05-21T16:28:52+05:30 IST