యూకే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

ABN , First Publish Date - 2022-10-08T03:36:36+05:30 IST

వీసా కాలపరిమితి ముగిసినా బ్రిటన్‌లో ఉండేవారిలో భారతీయులే అత్యధికమంటూ బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రెవర్మన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.

యూకే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

ఎన్నారై డెస్క్: వీసా కాలపరిమితి ముగిసినా బ్రిటన్‌లో ఉండేవారిలో భారతీయులే అత్యధికమంటూ బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రెవర్మన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. భారత్, బ్రిటన్‌ల మధ్య కుదిరిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్(ఎంఎంపీ) ఒప్పందం వల్ల బ్రిటన్‌కు ఆశించిన ప్రయోజనాలు చేకూరలేదని సుమెల్లా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  దీనిపై స్పందించిన భారత్..  ఎంఎంపీ ఒప్పందం ద్వారా బ్రిటన్ పేర్కొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నామని స్పష్టం చేసింది. ‘‘ఎంఎంపీ ద్వారా బ్రిటన్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. వీసా కాలపరిమితి ముగిసినా బ్రిటన్‌లో ఉండిపోయిన వారిని భారత్‌కు రప్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం’’ అని భారత్ హైకమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా.. ఎంఎంపీలో భాగంగా బ్రిటన్ ఇచ్చిన హామీల్లో ఎంత మేరకు పురోగతి జరిగిందనేదానిపై బ్రిటన్ వివరణ కోసం ఎదురుచూస్తున్నట్టు కూడా పేర్కొంది.  


కాగా.. వీసా ముగిసినా భారతీయులు అధిక సంఖ్యలో బ్రిటన్‌లో ఉండిపోతున్నారని హోం మంత్రి సుయెల్లా బ్రెవర్మన్ ఇటీవల పేర్కొన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య(ఎఫ్‌టీఏ) ఒప్పందం కుదురుకోనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఎఫ్‌టీఏలో భాగంగా వీసా నిబంధనలు సడలిస్తారన్న అన్న ప్రశ్నలకు ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు. దీంతో..వీసా అంశంలో భారత్‌కు మినహాయింపులు ఇచ్చేందుకు బ్రిటన్ సిద్ధంగా లేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

Updated Date - 2022-10-08T03:36:36+05:30 IST