పెళ్లి రోజున ప్యాంట్‌సూట్‌లో...

ABN , First Publish Date - 2020-11-26T05:48:28+05:30 IST

సంప్రదాయ చీరకట్టులో లేదా ఎంబ్రాయిడరీ లెహెంగాలో పెళ్లికూతురు పెళ్లి మండపానికి రావడం మన దగ్గర చాలాచోట్ల కనిపిస్తుంది. కానీ సంజనా రిషీ మాత్రం తన పెళ్లి రోజున ప్రత్యేకంగా డ్రెస్‌ చేసుకుంది. వర్థమాన వ్యాపారవేత్త అయిన ఈ భారతీయ అమెరికన్‌ ప్యాంట్‌సూట్‌లో పూలగుత్తి పట్టుకొని నవ్వులు చిందిస్తూ, సిగ్గుపడుతూ మండపానికి వచ్చింది. తన పెళ్లి రోజున

పెళ్లి రోజున ప్యాంట్‌సూట్‌లో...

సంప్రదాయ చీరకట్టులో లేదా ఎంబ్రాయిడరీ లెహెంగాలో పెళ్లికూతురు పెళ్లి మండపానికి రావడం మన దగ్గర చాలాచోట్ల  కనిపిస్తుంది. కానీ సంజనా రిషీ మాత్రం తన పెళ్లి రోజున ప్రత్యేకంగా డ్రెస్‌ చేసుకుంది. వర్థమాన వ్యాపారవేత్త అయిన ఈ భారతీయ అమెరికన్‌ ప్యాంట్‌సూట్‌లో పూలగుత్తి పట్టుకొని నవ్వులు చిందిస్తూ, సిగ్గుపడుతూ మండపానికి వచ్చింది. తన పెళ్లి రోజున ప్యాంట్‌సూట్‌ ధరించాలనేది ఆమెకు ఎప్పటి  నుంచో కోరిక. ఇటలీలో ఒక బొటిక్‌లో చూసిన సూట్‌ సంజనకు తెగ నచ్చింది. ‘‘నేను ముందే అనుకున్నా. పెళ్లి రోజున ప్యాంట్‌సూట్‌ వేసుకోవాలని.


ఏ రంగు ప్యాంట్‌సూటో కూడా నిర్ణయించుకున్నా. అది పాతకాలం నాటి సెకండ్‌ హ్యాండ్‌ సూట్‌. దాన్ని 1990లో ఇటలీకి చెందిన డిజైనర్‌ తయారుచేశాడు. నా పెళ్లి రోజు కూడా ఆ సూట్‌ అందుబాటులో ఉందని తెలియగానే నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం వేసింది. ప్యాంట్‌సూట్‌ ధరించే మహిళలు ఎంతో శక్తిమంతులని నేను ఎప్పుడూ అనుకుంటా. అందుకే నేను వాటిని ఎక్కువగా ఇష్టపడతా. ఎక్కువగా ధరిస్తా కూడా’’ అంటుందీ నవ వధువు. ఆమె వివాహం ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ధ్రువ్‌ మహాజన్‌తో ఈమధ్యే ఇరుకుటుంబాల సమక్షంలో జరిగింది. 


‘‘సంజనను చూసేంత వరకు తెలియదు తను ప్యాంట్‌సూట్‌లో వస్తుందని. ఆమె ఏ డ్రెస్‌ ధరించినా అందంగానే ఉంటుందని తెలుసు. ఆమె ఆ సూట్‌లో ఒక దేవకన్యలా, ఒక సౌందర్యరాశిలా కనిపించింది’’ అని ఆమె భర్త ధ్రువ్‌ మహాజన్‌ చెప్పడం తన భార్య ఇష్టాయిష్టాలకు ఆయన ఎంత విలువ ఇస్తారో తెలియజేస్తుంది. కొసమెరుపు ఏమిటంటే పౌడర్‌ బ్లూ ప్యాంట్‌సూట్‌లో ఆమె ఫొటోలు చూసి ఫ్యాషన్‌ డిజైనర్లు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. 

Updated Date - 2020-11-26T05:48:28+05:30 IST