Abn logo
Sep 29 2021 @ 00:35AM

ప్రమాదం అంచున..

కొండవాలు ప్రాంతాల్లో జారుతున్న మట్టి చినగదిలిలో నిర్మాణం కోసం కొండను తవ్వేసిన వైనం

భారీ వర్షాలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కొండవాలు ప్రాంతాల వాసులు

కంటి మీద కునుకు కరువు

వర్షానికి కిందికి జారుతున్న మట్టిపెళ్లలు

కొండచరియలు విరిగిపడే ప్రమాదం


(విశాఖపట్నం-ఆంఽధ్రజ్యోతి)

భారీవర్షాలకు 2015 డిసెంబరులో కప్పరాడలో కొండచరియలు జారి నివాసంపై పడడంతో ఇద్దరు మృతిచెందారు. అంతకుముందు ఏడాది పెదగదిలిలో మట్టిపెళ్లలు జారిపడడంతో ఒక మహిళ మృతిచెందింది. అదే సమయంలో సాగర్‌నగర్‌లో మహిళ కొండచరియ విరిగిపడడంతో మృతిచెందింది. 


...ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమ వారం వేకువజామున వేపగుంట అప్పలనరసింహనగర్‌ కొండవాలు ప్రాంతంలో రక్షణ గోడ కూలి దిగువనున్న ఇంటిపై పడడంతో దులసి భావన (35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఆ సమయంలో ఆమె భర్త, ఇద్దరు పిల్లలు వేరే గదిలో వుండడంతో సురక్షితంగా బయటపడ్డారు.


నగరంలో భారీవర్షం కురిస్తే కొండవాలు ప్రాంతాల్లో నివాసం వుంటున్నవారు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన కూలీలు, నిరుపేదలు తక్కువ అద్దెకు ఇళ్లు లభిస్తాయని కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటివారి తాకిడి పెరగడంతో కొంతమంది స్థానిక రాజకీయ నేతలు కొండవాలు ప్రాంతాలను చదును చేసి తక్కువ మొత్తానికి విక్రయించడం,  తామే రేకుల షెడ్లు వేసి అద్దెకు ఇవ్వడం మొదలెట్టారు. కొన్నాళ్లకు వాటికి విద్యుత్‌ కనెక్షన్లు, కొళాయి కనెక్షన్లు ఇచ్చి ఇంటి పన్ను విధిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో కొండ ఎక్కి, దిగేందుకు మెట్లు, చిన్నపాటి నడకదారులను జీవీఎంసీ ఏర్పాటుచేయాల్సి వస్తోంది. దీంతో కొండవాలు ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. వెంకోజీపాలెం, సింహాద్రిపురం, హనుమంతవాక, పెదగదిలి, చినగదిలి, తోటగరువు, రామకృష్ణాపురం, ధారపాలెం, బీఎన్‌ఆర్‌ నగర్‌, బాపూజీనగర్‌, నీలకంఠనగర్‌, రాంజీ ఎస్టేట్‌, కప్పరాడ, కైలాసపురం, ఇందిరాగనర్‌, రాంజీ ఎస్టేట్‌, వేపగుంట, బీసీ కాలనీ, ముచ్చుమాంబ కాలనీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, అడవివరం వంటి ప్రాంతాల్లో కొండవాలుపై సుమారు 60 వేల వరకూ అసెస్‌మెంట్లు వున్నట్టు అధికారుల అంచనా. సాధారణ రోజుల్లో ఏదోలా కాలం గడిపేసినా...వర్షాకాలం వస్తే మాత్రం గుండెలు అరచేతితో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. భారీవర్షం కురిస్తే కొండవాలు బాగా నాని మట్టి కిందకు జారుతుంది. దీనివల్ల కొండచరియలు జారి నివాసాలపై పడుతుంటాయి. కొండవాలు ప్రాంతాల్లో ఏదైనా ఘటన జరిగినపుడల్లా అధికారులు రక్షణ గోడలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంటారు. కానీ, అవి కార్యరూపం దాల్చడం లేదు. దీనికి అధికారులు మాత్రం ఆక్రమణలు రోజురోజుకూ పెరగడం వల్లే ముందుకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. అంచనాలు తయారుచేసినప్పుడు ఉన్న పరిస్థితికి, పని ప్రారంభించాలనుకునే  సమయానికి మధ్య ఆక్రమణలు మరింతపైకి వెళ్లడం వల్ల పనులు చేపట్టలేకపోతున్నాంటున్నారు.  


రేపు భువనేశ్వర్‌-ముంబై రైలు రద్దు

ఆలస్యంగా నడుస్తున్న రీ షెడ్యూల్‌ రైళ్లు

మిగిలినవి యథావిధిగా రాకపోకలు


విశాఖపట్నం, సెప్టెంబరు 28: భువనేశ్వర్‌ నుంచి విశాఖపట్నం మీదుగా ముంబై వెళ్లే 01020 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును గురువారం (30న) రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. కాగా బెంగళూరు-అగర్తాలా (05487) ఎక్స్‌ప్రెస్‌ను బుఽధవారం రీ షెడ్యూల్‌ చేశారు. వాస్కోడిగామ-హౌరా (08048), యశ్వంతపూర్‌-హౌరా (02874), యశ్వంత్‌పూర్‌-హౌరా (02246) ప్రత్యేక రైళ్లను మంగళవారం రీ షెడ్యూల్‌ చేసిన నేపథ్యంలో గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. 


యథావిధిగా మిగిలిన రైళ్ల రాకపోకలు

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం తగ్గడంతో పలు రైళ్లను పునరుద్ధరించారు. రీ షెడ్యూల్‌ చేసిన నాలుగైదు రైళ్లు తప్ప దాదాపు అన్ని రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లోని సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్టేషన్‌లోకి వర్షం నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మంగళవారం భారీవర్షాలు కురవకపోవడంతో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల తాకిడి కనిపించింది. జన్మభూమి, సమతా, రత్నాచల్‌, తిరుమల వంటి ఒరిజినేటింగ్‌ రైళ్లు ఇక్కడ నుంచి నిర్ణీత సమయాలకు బయలుదేరాయి. అలాగే గత రెండు రోజులుగా రైళ్ల రద్దుతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రయాణికులు మంగళవారం పలు రైళ్లలో నగరానికి చేరుకున్నారు.