రెండో వారంలో ప్రాణాల మీదకు...

ABN , First Publish Date - 2021-05-04T05:06:45+05:30 IST

ప్రస్తుతం కరోనా వైరస్‌ కొత్త రకం (న్యూ వేరియెంట్‌) వ్యాప్తి చెందుతోందా?...మొదటి దశతో పోలిస్తే రెండో దశ వైరస్‌ ప్రమాదకరమైనదా?...వైరస్‌ సోకిన తొలి వారం కంటే రెండో వారంలోనే ఎక్కువ మందికి ఆక్సిజన్‌ కావాల్సి వస్తోందా?...అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు.

రెండో వారంలో ప్రాణాల మీదకు...

మందుల వినియోగంతో మొదటి వారంలో కరోనా లక్షణాలు తగ్గుముఖం

ఆ సమయంలోనే ఊపిరితిత్తులపై దాడి

8-14 రోజుల మధ్య ఒక్కసారిగా పరిస్థితి విషమం

కొందరిలో తీవ్రమైన న్యుమోనియాకు కారణమవుతున్న వైరస్‌

మరికొందరిలో పడిపోతున్న ఆక్సిజన్‌ లెవెల్స్‌

ఆక్సిజన్‌/వెంటిలేటర్‌ పడకలు వంద రెట్లు పెంచాల్సి ఉందని వైద్యుల అభిప్రాయం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

ప్రస్తుతం కరోనా వైరస్‌ కొత్త రకం (న్యూ వేరియెంట్‌) వ్యాప్తి చెందుతోందా?...మొదటి దశతో పోలిస్తే రెండో దశ వైరస్‌ ప్రమాదకరమైనదా?...వైరస్‌ సోకిన తొలి వారం కంటే రెండో వారంలోనే ఎక్కువ మందికి ఆక్సిజన్‌ కావాల్సి వస్తోందా?...అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. మొదటి దశతో పోలిస్తే ఆక్సిజన్‌ అవసరం అవుతున్న బాధితుల సంఖ్య పదుల రెట్లు పెరిగిందంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో వున్న ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్స్‌ను 200 రెట్లు పెంచితే గానీ బాధితుల అవసరాలను తీర్చలేమని పేర్కొంటున్నారు. 

కరోనా బారినపడిన వారిలో ప్రస్తుతం మొదటి వారంలో జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో చాలామంది హోమ్‌ ఐసోలేషన్‌లో వుంటూ మందులు వినియోగిస్తున్నారు. దీంతో చాలామందిలో వారం రోజులకే కొవిడ్‌ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయి. చాలామంది కరోనా పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ...ఏడు నుంచి 14వ రోజు మధ్యలో రెండోసారి ఎక్కువ మందిలో ఉపద్రవం ముంచుకువస్తోంది. వైరస్‌ సోకిన మొదటి వారంలో మందుల వినియోగం వల్ల లక్షణాలు తగ్గినప్పటికీ చాలామందిలో ఊపిరితిత్తులను వైరస్‌ దెబ్బతీస్తోంది. దీంతో ఊపిరితిత్తులు గట్టిపడి 8-14 రోజుల మధ్య ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరిలో న్యుమోనియాకు దారితీస్తుండగా, మరికొందరిలో ఒక్కసారిగా ఆక్సిజన్‌ లెవెల్స్‌ 90 కంటే తక్కువకు పడిపోతున్నాయి. మొదటి దశలో అతి కొద్దిమందిలో మాత్రమే ఇటువంటి పరిస్థితి కనిపించగా, ప్రస్తుతం అది పదుల రెట్లు పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్స్‌కు డిమాండ్‌ పెరిగినట్టు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 


ర్యాపిడ్‌ స్ర్పెడింగ్‌

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్‌ కొత్తరకంగా వుందని నిపుణులు పేర్కొంటున్నారు. మొదటి దశతో పోలిస్తే..ఇది కొంత భిన్నంగా వుంటోందని చెబుతున్నారు. గతంలో ఒకరికి వైరస్‌ సోకితే..కుటుంబంలో మరొకరికి వచ్చేది కాదని, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్‌ ఇంట్లో ఒకరికి సోకితే..మిగిలిన కుటుంబ సభ్యులందరికీ వ్యాప్తి చెందడంతోపాటు..ఫ్లోర్‌ మొత్తానికి అంటుకుంటోందని పేర్కొంటున్నారు. వైరస్‌ వ్యాప్తి వేగంగా వుండడం వల్లనే వందలాది కేసులు నమోదవుతున్నాయంటున్నారు.


ఏ వయసువారికైనా... 

మొదటి దశలో కరోనా వయో వృద్ధులను, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎక్కువగా బలి తీసుకుంది. సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందుతోన్న వైరస్‌కు వయసుతో సంబంధం లేదు. అప్పటివరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని యక్తవయస్కులు కూడా కరోనా బారినపడి ఊపిరి అందక మృత్యువాత పడుతున్నారు. దీనిపై పరిశోధన చేస్తేనేగానీ..అసలు కారణాలు తెలియవని నిపుణులు పేర్కొంటున్నారు.  

వందల రెట్లు పడకలు పెంచాలి..

- డాక్టర్‌ ద్వారకానాథ్‌, గీతం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్‌ కొత్త రకంగా ఉంది. ముఖ్యంగా ఈ వైరస్‌ సోకిన ఎక్కువ మందికి ఆక్సిజన్‌, వెంటిలేటర్స్‌ కావాల్సి వస్తోంది. ఈ వైరస్‌ సోకిన వాళ్లలో లక్షణాలు కూడా కొత్తవి కనిపిస్తున్నాయి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కండ్ల కలక వంటివి ఉంటున్నాయి. మరో నెల రోజులపాటు ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో వున్న వాటి కంటే వందల రెట్లు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పడకలు పెంచితేనేగానీ ప్రాణాలను నిలబెట్టలేం. ముందు కేసులు తగ్గుముఖం పట్టేలా చేయడంపై దృష్టిసారించాలి. అందుకు వున్న ఒకేఒక్క మార్గం ప్రజల మూవ్‌మెంట్‌ను తగ్గించడం. అది చేస్తేనే తప్ప కేసులను తగ్గించడం సాధ్యం కాదు. 


Updated Date - 2021-05-04T05:06:45+05:30 IST