ఇసుక ర్యాంపుల్లో.. ఆగని దందా!

ABN , First Publish Date - 2021-07-27T05:08:22+05:30 IST

ప్రభుత్వం ఎన్ని విధానాలు ప్రవేశపెట్టినా.. సామాన్య వినియోగదారులకు ఇసుక కష్టాలు తప్పడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమార్కులకు చెక్‌పెట్టేందుకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ విధానం ప్రవేశపెట్టింది. అయినా అక్రమాలు ఆగకపోవడంతో తాజాగా ఆఫ్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు.. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై హవా సాగిస్తున్నారు. ఇసుక కొరత సృష్టిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టరు ఇసుక కోసం ర్యాంపు వద్ద కనీసం రెండు రోజుల ;్ఛవేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీనికితోడు వినియోగదారులపై వెయిటింగ్‌ చార్జీల మోత మోగుతోంది.

ఇసుక ర్యాంపుల్లో.. ఆగని దందా!
సరుబుజ్జిలి మండలం యరగాం ర్యాంపు వద్ద ఇసుక ట్రాక్టర్లు, లారీలు

- పాలసీ మారినా తప్పని కష్టాలు

- కాంట్రాక్టరుతో స్థానిక నేతల కుమ్మక్కు

- వినియోగదారులపై వెయిటింగ్‌ చార్జీల మోత

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఎన్ని విధానాలు ప్రవేశపెట్టినా.. సామాన్య వినియోగదారులకు ఇసుక కష్టాలు తప్పడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమార్కులకు చెక్‌పెట్టేందుకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ విధానం ప్రవేశపెట్టింది. అయినా అక్రమాలు ఆగకపోవడంతో తాజాగా ఆఫ్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు.. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై హవా సాగిస్తున్నారు. ఇసుక కొరత సృష్టిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టరు ఇసుక కోసం ర్యాంపు వద్ద కనీసం రెండు రోజుల ;్ఛవేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీనికితోడు వినియోగదారులపై వెయిటింగ్‌ చార్జీల మోత మోగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జేపీ వెంచర్స్‌ సంస్థకు ఇసుక విక్రయాల కాంట్రాక్ట్‌ను అప్పగించింది. జిల్లాలో సుమారు 12 ర్యాంపులు జేపీ వెంచర్స్‌ నిర్వహిస్తోంది. వీటితో పాటు మొత్తం 27 ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, కొన్ని చోట్ల మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం, యరగాం, నరసన్నపేట మండలం మడపాం, బుచ్చిపేట, శ్రీకాకుళం మండలం కరజాడ ర్యాంపుల వద్ద ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. ప్రభుత్వ కొత్త విధానంతో జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రాన్స్‌ఫోర్టు  యజమానులుగా అవతారమెత్తారు. ఇసుక తవ్వకాల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని, రేవుల నుంచి   దారి మళ్లిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులకు ఇసుక కొరత ఏర్పడి.. రెట్టింపు ధర చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎవరికైనా ఇసుక అత్యవసరమైతే.. చోటా నాయకులను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అధిక ధర చెల్లిస్తే చాలు గంటల్లో ఇసుక నిల్వలు ఇంటికి చేరిపోతాయి. లేదంటే రోజుల తరబడి వాహనాలు ర్యాంపుల వద్దే నిలిచిపోతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ర్యాంపు వద్ద టన్ను ఇసుకకు రూ.475 చెల్లించాలి. ఒక ట్రాక్టర్‌కు మూడు టన్నులు లోడ్‌ చేస్తే రూ.1475 ఇవ్వాలి. రవాణాకు సంబంధించి పది కిలోమీటర్ల పరిధిలో అయితే మరో రూ.2వేలు చెల్లించాలి. కానీ, వీటితో పాటు ట్రాక్టర్ల యజమానులు ర్యాంపు వద్ద ఎన్ని రోజులు వేచి ఉంటే.. అన్ని రోజులకు వెయిటింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో లారీకి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఇసుక కొనుగోలుదారులకు ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. విశాఖకు తరలించేందుకు యూనిట్‌ ధర రవాణా చార్జీలతో కలిపి నాలుగు రెట్లు చెల్లించాల్సి వస్తోంది. 


 ర్యాంపుల వద్ద తరచూ వివాదాలు... 

స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు ర్యాంపుల నిర్వాహకులతో కుమ్మక్కై తమ వాహనాలకు ముందుగా ఇసుక లోడ్‌ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ ర్యాంపు వద్ద ఆమదాలవలస నుంచి వచ్చిన స్థానిక వాహనాలకు దొడ్డిదారిన ఇసుక లోడ్‌లు చేశారు. దీనిపై విశాఖ నుంచి వచ్చిన కొందరు ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు జేపీ వెంచర్స్‌ నిర్వాహకులను నిలదీశారు. తమను రెండు, మూడు రోజులు ర్యాంపు వద్దే ఉంచేసి.. స్థానిక వాహనాలకు మాత్రం వెంటనే లోడ్‌లు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో స్థానిక నేత ఒకరు కలుగజేసుకొని ఇరువర్గాలకు సమన్యాయం చేస్తానని సర్దిచెప్పినట్లు తెలిసింది. ఇలా తరచూ ఇసుక ర్యాంపుల వద్ద ట్రాన్‌పోర్టు యజమానులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-07-27T05:08:22+05:30 IST