మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2020-07-07T08:28:17+05:30 IST

నవరత్న పథకాల్లో భాగమైన ‘పేదలకు ఇళ్ల స్థలాలు’ పంపిణీ కార్యక్రమం మూడోసారీ ..

మళ్లీ వాయిదా

ఇళ్ల పట్టాల పంపిణీపై మూడోసారి వెనక్కి

స్థలాల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం 

ఎప్పుడు ఇస్తారో అధికారికంగా చెప్పని సర్కారు 

సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసే కారణం

ఈ వారంలో విచారణకు రావొచ్చని అంచనా

అంత వరకూ వాయిదా వేయాలని నిర్ణయం

కేసు ఉన్నా తొలుత ముహూర్తం.. చివరగా రద్దు


పేదల ఇళ్ల స్థలాల పట్టాలకు ‘కన్వేయన్స్‌ డీడ్‌’లు ఇవ్వకూడదని తెలుసు. సదరు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టిందనీ తెలుసు. సుప్రీంకోర్టులో నిర్ణయం అనుకూలంగా వస్తుందో, లేదో తెలియదు. అయినా సరే... ‘జూలై 8వ తేదీన రికార్డు స్థాయిలో ఇళ్లపట్టాల పంపిణీ’ అని పేదలను ఊరించారు. తీరా ముహూర్తం దగ్గరికొచ్చాక... ‘కన్వేయన్స్‌ డీడ్‌లను సుప్రీంకోర్టు కూడా తప్పు పడితే ఎలా! అప్పుడు పేదలకు ఇచ్చిన పట్టాలు చెల్లకుండా పోతాయి’ అనే ఆందోళనతో.... పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.


అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): నవరత్న పథకాల్లో భాగమైన  ‘పేదలకు ఇళ్ల స్థలాలు’ పంపిణీ కార్యక్రమం మూడోసారీ వాయిదాపడింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌  పెండింగ్‌లో ఉన్నందున ఈ నెల 8న జరగాల్సిన పంపిణీ  కార్యక్రమాన్ని వాయిదావేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న పట్టాలు పంపిణీ చేద్దామని భావిస్తున్నా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. సుప్రీంకోర్టులో కేసుపై ఆలోగా స్పష్టత వస్తే అదే ముహూర్తాన్ని ఖరారు చేస్తారని తెలిసింది. ఈ వారంలో కేసు విచారణకు రావొచ్చని, ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీని కొంతకాలం వాయిదావేస్తే బాగుంటుందన్న నిపుణుల సూచన మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ కార్యక్రమం ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి ఇంటి పట్టాలు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.


దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ సేకరణ చేపట్టింది. పేదల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇప్పటికే అనేక కేసులు హైకోర్టులో నడుస్తున్నాయి. ఉగాది నాటికి కార్యక్రమం చేపడతామని తొలుత చెప్పారు. కరోనా వ్యాప్తితో ఆ ముహూర్తం వాయిదా పడింది. అనంతరం ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి నాడు దీనిని చేపట్టాలని నిర్ణయించారు. అప్పటికి కరోనా తీవ్రత మరింత పెరగడంతో అది కూడా వాయిదాపడింది. తర్వాత జూలై 8న చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. ఆ రోజు వైఎస్‌  రాజశేఖరరెడ్డి జయంతి. ఈ ప్రత్యేకత కలిసొస్తుందని, ఈ లోగా భూసేకరణ, బిల్లుల చెల్లింపు అన్నీ సిద్ధం చేయాలని  రెవెన్యూశాఖను ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెట్టించింది. దీంతో అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కూడా పేదల పేరుచెప్పి నిరుపేదల నుంచే భూములు లాక్కున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నియమాలనే ఉల్లంఘించి చెరువులు, కుంటలు, ఆవ భూములతోపాటు మడ అడవులను సైతం ఇళ్లస్థలాల కోసం చదునుచేసి లే అవుట్‌లు వేశారు.


ఇప్పుడు వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇళ్ల పట్టాల పాలసీని నిర్దేశించే జీవో 44నే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇది విచారణకు రావాల్సి ఉంది.  ఈ లోగానే జూలై 8న కన్వేయన్స్‌ డీడ్‌ పద్ధతిలోనే ఇంటిపట్టాల పంపిణీ చేపట్టడానికి యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. 15లక్షలపైనే స్టాంప్‌పేపర్లను కొనుగోలు చేసింది. వాటిపై ఇప్పటికే లబ్ధిదారుల వివరాలు నమోదుచేసి అధికారులు సిద్ధంగా ఉంచారు. మారిన నిబంధనల ప్రకారం ఖాళీస్థలం అమ్ముకోవడానికి వీల్లేదని పేర్కొంటూనే, ఇంటి నిర్మాణం పూర్తయిన ఐదేళ్ల తర్వాత నిబంధనలకు లోబడి అమ్ముకోవచ్చని దానిపై పేర్కొన్నారు. వీటిపై కూడా అనేక ధర్మసందేహాలు తలెత్తాయి.


‘హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ జీవో 44, దానికి అనుబంధమైన అనేక ఉత్తర్వులను కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది విచారణకు రాకుండా, సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశమూ వెలువడక ముందే కన్వేయన్స్‌ డీడ్‌ల రూపంలో ఇంటిపట్టాలు ఇవ్వడం అసైన్డ్‌ చట్టం నియమ నిబంధనలకు విరుద్ధమవుతుంది. పైగా, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లవుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే ఇంటిపట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం వేసిన కేసు ఈ వారంలోనే సుప్రీంకోర్టులో విచారణ(పోస్టింగ్‌)కు వస్తుందన్న నమ్మకం ఉంది’ అని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - 2020-07-07T08:28:17+05:30 IST