సామాన్యుడిపై.. ధరాభారం

ABN , First Publish Date - 2022-01-24T05:29:17+05:30 IST

సామాన్యుడిపై.. ధరాభారం

సామాన్యుడిపై.. ధరాభారం

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

చుక్కలనంటిన నూనెలు, కూరగాయలు 

రెట్టింపైన సగటుజీవి ఖర్చులు

అశ్వారావుపేట, జనవరి 23: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవన ప్రమాణాల పెరుగుదల అటుంచి ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనాలంటేనే జేబు తడుముకోవాల్సిన పరిస్థితులొచ్చాయి. అంతర్జాతీయంగా పెరిగిన ధరల కారణంగా దేశీయంగా వంటనూనెల ధరల్లో భారీగా పెరుగుదల నమోదైంది. గత ఏడాది లీటరు రూ.80నుంచి రూ.90మధ్య ఉన్న వంట నూనెల ధరలు ఇప్పుడు రూ.130నుంచి రూ.140వరకు పెరిగింది. పెరిగిన పెట్రో ధరలు కూడా నిత్యావసరాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచాయి. వీటికి తోడు ఈ సంవత్సరం అధిక వర్షాలతో కూరగాయల ఉత్పత్తులు భారీగా తగ్గిపోయాయి. ఇతర ప్రాంతాలను దిగుమతి కావాల్సి రావడంతో రవాణా చార్జీలు పెరిగి అంతిమంగా ఆ భారం వినియోగదారుడిపై పడుతోంది. ప్రభుత్వాలు వేసే కొవిడ్‌ టాక్స్‌లు, ఇతర పన్నుల కారణంగా కాస్మొటిక్స్‌, గృహోపకరణాలు, దుస్తులు, చెప్పులు, ఎలకా్ట్రనిక్స్‌ ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్ని నెలలుగా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ఆ ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై తీవ్రంగా పడుతోంది.  

పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలు

ఇరు జిల్లాల్లో సగటున నిత్యావసర ధరలు ఇలా ఉన్నాయి. వంటనూనె లీటరు రూ.140, కందిపప్పు కిలో రూ.95, పెసరపప్పు రూ.100, మినపప్పు రూ.90, పంచదార రూ.45, పచ్చిశెనగ పప్పు రూ.80, శెనగపిండి రూ.90, గోదుమపిండి రూ.35, గోదుమరవ్వ రూ.35, వేపిన పప్పు రూ.80, చింతపండు రూ.100, ఎండి మిర్చి రూ.200, బెల్లం రూ.50, గుళ్లు రూ.120, జీడిపప్పు రూ.700 ఉన్నాయి. కూరగాయలు ఉల్లి రూ.35, మిర్చి రూ.50, టమాట రూ.30, బీర రూ.60, వంకాయ రూ.40, బెండ రూ.60, దొండ రూ.40, దుంపలు రూ.30, కాకర రూ.60 క్యాబేజీ రూ.40, కంద రూ.40, చామ రూ.40, గోరుచుక్కుడు రూ.60, చిక్కుడు రూ.40, కాలిప్లవర్‌ రూ.20, అల్లం రూ.40, దోసకాయ రూ.40, క్యారట్‌ రూ.60, బీట్‌రూట్‌ రూ.60, అరటి ఒక్కటి ఐదు రూపాయలు, పొట్లకాయ రూ.20, ఆనపకాయ రూ.10.. వీటి ధరలను పరిశీలిస్తే గత ఏడాదికి ఇప్పటికి 30నుంచి 60 శాతం వరకు పెరిగిపోయాయి. పెరిగిన ఈ ధరలు సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతున్నాయి.

పెట్టుబడి పెరగటం వల్లే ధరలు పెరిగాయి 

నల్లపు వెంకటరమణ, రైతు 

సాగులో పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు, ఇతర ప్రాంతాల నుండి దిగుమతులు చేసుకోవడం, స్థానిక పన్నులు పెరగటంవల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం వీటి నియంత్రణపై దృష్టిపెట్టి సామాన్యులకు భారం లేకుండా చూడాలి.

Updated Date - 2022-01-24T05:29:17+05:30 IST