ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులపై.. సర్వే నివేదికను ఎన్నేళ్లు పరిశీలిస్తారు?

ABN , First Publish Date - 2022-05-20T09:30:01+05:30 IST

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులపై.. సర్వే నివేదికను ఎన్నేళ్లు పరిశీలిస్తారు?

మా ముఖంపై ఏదో కవర్‌ పడేస్తారు

అందులో మీ వైఖరేంటో చెప్పరు

పదేళ్లు గడువిచ్చినా ఇలాగే చేస్తారు

ఓబుళాపురం గనుల కేసులో..

కేంద్రంపై చీఫ్‌ జస్టిస్‌ రమణ ధర్మాసనం ఫైర్‌

న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దులను ఖరారు చేస్తూ సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన నివేదికను అమలు స్థితి ఏమిటని ప్రశ్నించింది. 2010 నాటి ఈ కేసుపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సరిహద్దులపై సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన నివేదికను అమలు చేయాలని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘మా ముఖంపై ఏదో కవర్‌ పడేస్తారు కానీ అందులో మీ వైఖరేంటో చెప్పరు. మీరు సర్వే నిర్వహించారు. మీ వైఖరి చెప్పరు. సరిహద్దులను ఇప్పటికే ఖరారు చేసినట్లు ఓబుళాపురం మైనింగ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అంటున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.


దీనిని పరిశీలిస్తామని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ బదులివ్వగా.. ‘ఏం పరిశీలిస్తారు.? పరిశీలించడానికి ఎన్నేళ్ల సమయం కావాలి..? మరో పదేళ్లు గడువిచ్చినా మీరు ఇలాగే  వ్యవహరిస్తారు. ఇది చాలా సీరియస్‌ వ్యవహారం’ అని కటువుగా వ్యాఖ్యానించింది. సర్వే నివేదికపై ఆంధ్ర ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించింది. ఏపీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. మైనింగ్‌ శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ విదేశాల్లో ఉన్నారని, వారం రోజుల్లో సూచనలు తీసుకుంటానని సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో ఆ నివేదిక అమలు స్థితి ఏమిటో తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూలైకి వాయిదా వేసింది. విచారణలో భాగంగా ఓబుళాపురం కంపెనీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.


ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో ఓఎంసీకి  మైనింగ్‌ లీజులు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే కర్ణాటకలో కాకుండా ఏపీలో మైనింగ్‌ చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించడంతో 2010లో కోర్టు మైనింగ్‌ను సస్పెండ్‌ చేసిందని వివరించారు. ఆ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులను ఖరారు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని, 8 ఏళ్ల తర్వాత సరిహద్దులను ఖరారు చేస్తూ 2018లో సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక సమర్పించగా.. ఆ నివేదికను అమలు చేయాలని 2018లో జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌ నేతృత్వంలోని అప్పటి ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించిందని గుర్తుచేశారు. 

Updated Date - 2022-05-20T09:30:01+05:30 IST