7న అడవివరం పైడితల్లమ్మ పండుగ

ABN , First Publish Date - 2022-05-25T06:02:43+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామి సోదరి, అడవివరం, తదితర ఏడు గ్రామాల ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లమ్మ పండుగను జూన్‌ ఏడున జరపాలని నిర్ణయించినట్టు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ప్రకటించారు.

7న అడవివరం పైడితల్లమ్మ పండుగ
గామసభలో మాట్లాడుతున్న ఈవో సూర్యకళ

సింహాచలం, మే 24: సింహాద్రి అప్పన్న స్వామి సోదరి, అడవివరం, తదితర ఏడు గ్రామాల ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లమ్మ పండుగను జూన్‌ ఏడున జరపాలని నిర్ణయించినట్టు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ప్రకటించారు. అడవివరం మాజీ సర్పంచ్‌, పైడితల్లమ్మ పూజారి వంశీయులు లండ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక నృసింహసదన్‌లో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ అమ్మవారి పండుగ సందర్భంగా గ్రామాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని, రోజంతా ఉచిత ప్రసాద వితరణ జరపాలని, గతంలో మాదిరిగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామస్థులు స్వహస్తాలతో తాకి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. అనంతరం లండ వెంకటరమణ గ్రామ దేవతల పండుగల తేదీలను ప్రకటించగా అందరూ ఆమోదించారు. గ్రామసభ ఆమోదించిన పండుగల వివరాలిలా ఉన్నాయి. 

ఇవీ పండుగుల వివరాలు..

ఈ నెల 28న సరిహద్దు దేవత మరిడమ్మ పండుగ చాటింపు, 29న మరిడమ్మ పండుగ అనుపు మహోత్సవం, అదే రోజున ఉజ్జి పోలమ్మ జాతర చాటింపు, అనుపు ఉత్సవం, 30న పైడితల్లమ్మ, ముత్యాలమ్మ దేవర తెచ్చుట, 31న ముత్యాలమ్మ అనుపోత్సవం, జూన్‌ ఆరున పైడితల్లమ్మ తొలేళ్లు, ఏడో తేదీన పైడితల్లమ్మ అనుపోత్సవం, 14న పైడితల్లమ్మ మారువారం పండుగ నిర్వహిస్తారు. గ్రామసభలో కార్పొరేటర్‌ పిసిని వరాహనరసింహం, పాశర్ల ప్రసాద్‌, కొలుసు ఈశ్వరరావు, ఎర్రా వరంబాబు, లంక సత్తిబాబు, కర్రి అప్పలస్వామి, గంట్ల శ్రీనుబాబు, ఏఈవో ఎన్‌.ఆనందకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T06:02:43+05:30 IST