అడుగు ముందుకా? వెనక్కా?

ABN , First Publish Date - 2021-01-25T06:30:41+05:30 IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠకు తెరపడుతుందా? లేక ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతుందా? అనే అంశంపైనే జిల్లాలో అంతటా చర్చనడుస్తోంది.

అడుగు ముందుకా? వెనక్కా?

ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడేనా?

వ్యాక్సిన్‌ వేసుకున్నాకే ఎన్నికల విధులకు పట్టువీడని ఉద్యోగ సంఘాలు

సుప్రీం కోర్టు నిర్ణయం కోసమే నిరీక్షణ

గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం


పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠకు తెరపడుతుందా? లేక ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతుందా? అనే అంశంపైనే జిల్లాలో అంతటా చర్చనడుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నది. ఆ తీర్పుపైనే ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది.


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కోసమే అందరూ నిరీక్షిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పే కీలకం కానున్నందున దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశాలే అధికంగా ఉన్నాయనే వాదన ఒకపక్క వినిపిస్తుండగా, మరోపక్క వ్యాక్సిన్‌ వేయించుకోకుండా ఎన్నికల విధులకు వెళ్లలేమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేయడంతో ఏమి జరగబోతోందనేదే అందరి ఉత్కంఠ. ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల షెడ్యూలును విడుదల చేశారు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి, ఎన్నికల విధులకు సంబంధించి అధికారులను నియమిస్తేనే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉంది. కృష్ణాజిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ కలెక్టర్‌లు ఎన్నికల నోటిపికేషన్‌ను విడుదల  చేయకపోవడంతో ఏమి జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.


విధులకు హాజరయ్యేది లేదు 

 పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా, కరోనా వ్యాక్సిన్‌ రెండు విడతలు వేయించుకోకుండా ఎన్నికల విధులకు హాజరుకాలేమని  ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాల్సి ఉంది. దీనిపై ఉద్యోగసంఘాల నాయకుల నిర్ణయమే అందరి నిర్ణయమనే వాదనను పలువురు ఉద్యోగులు వినిపిస్తున్నారు. ఉద్యోగుల్లో పది శాతం మంది విధులకు హాజరైనా, ఎన్నికల నిర్వహణ ఆ కొద్దిమందితో అయ్యే పనికాదని చెబుతున్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా ఒకే పోలింగ్‌బూత్‌లో నాలుగైదు విభాగాలుగా చేసి  పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ జరపాల్సి ఉందని ఉద్యోగులు అంటున్నారు. 


గ్రామాల్లో వేడెక్కిన రాజకీయాలు

 ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విభేదాలు, కోర్టు తీర్పులు,  కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాల నడుమ అసలు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? లేదా, గ్రామాల్లో  ఏ నలుగురు కూడినా  ఇదే అంశం చర్చకు వస్తోంది.  ప్రస్తుతం ఎన్నికలు పెడితే  అధికార, ప్రతిపక్షపార్టీలకు జరిగే మేలు ఎంత,  నష్టం ఎంత అనే అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దందాలు, అక్రమాలు ఆ పార్టీని ఇరుకున పెడతాయని ప్రతిపక్షపార్టీ నాయకులంటుంటే, ఎన్నికలు ఎపుడు వచ్చినా అధికార పార్టీ బలపరిచినవారినే ప్రజలు ఆదరిస్తారనే వాదనను అధికార పార్టీ నాయకులు వినిపిస్తున్నారు. సర్పంచ్‌ పదవులపై ఆశతో ఉన్న నాయకులు వార్డు సభ్యులుగా ఎవరిని నిలబెట్టాలి? పరిస్థితులు తమకు ఎక్కడ అనుకూలంగా ఉన్నాయి? ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి? వాటిని ఎలా అధిగమించాలనే అంశాలపై తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరిగితే అనంతరం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపైనా చర్చలు కొనసాగుతున్నాయి.  ఇప్పటికే మూడు సంవత్సరాలుగా పంచాయతీలు పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గుతున్నాయని, ప్రభుత్వం పంతానికి  పోకుండా ఎన్నికలు  నిర్వహిస్తే ఇంత రాద్ధాంతం ఉండదు కదా అనే వాదన పలువురి నుంచి వినిపిస్తోంది. 

Updated Date - 2021-01-25T06:30:41+05:30 IST