బడుల విలీనంపై భగ్గు!

ABN , First Publish Date - 2022-07-06T08:15:01+05:30 IST

సరైన ప్రణాళిక లేకుండా చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియకు నిరసన సెగ తగిలింది. మంగళవారం బడులు తెరుచుకున్న వెంటనే రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగారు. 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల..

బడుల విలీనంపై భగ్గు!

3, 4, 5 తరగతులు తరలించొద్దని 

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు

పాఠశాలల ఎదుట బైఠాయించి నినాదాలు

కొన్నిచోట్ల కంచె వేసి అధికారుల అడ్డగింత

సర్కారు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త నిరసన

పాఠశాలలు తెరిచిన తొలి రోజే గందరగోళం

అర్ధరాత్రి ఆదేశాలపై సంఘాల ఆగ్రహం


అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): సరైన ప్రణాళిక లేకుండా చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియకు నిరసన సెగ తగిలింది. మంగళవారం బడులు తెరుచుకున్న వెంటనే రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగారు. 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల నుంచి వేరుచేసి ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే చర్యలను అడ్డుకున్నారు. చిన్న పిల్లలను పక్క గ్రామాలకు పంపడం పట్ల తల్లిదండ్రులు నిరసనలు తెలిపారు. పాఠశాలల గేట్ల ముందు కూర్చుని తరగతులు తరలించొద్దంటూ నినాదాలు చేశారు. కొన్ని చోట్ల అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి రాకుండా కంచె వేసి అడ్డగించారు. అనంతపురం జిల్లాలోని చెలిమేపల్లి గ్రామంలో విలీనం వద్దంటూ తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. మా పాఠశాల మాకే కావాలంటూ ఎంఈవో, ఉపాధ్యాయులను పాఠశాల నుంచి బయటకు పంపి, దారికి అడ్డంగా కంచెలు వేశారు. అదే జిల్లాలోని గలగల గ్రామంలో విలీనం వద్దంటూ పాఠశాల గేటు వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. తమ విద్యార్థులు తమ గ్రామంలోనే చదువుకుంటారని, ఈ మేరకు మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు.


జిల్లాలోని కనేకల్లు గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు చిన్నపిల్లలను పంపలేమని ఆందోళన వ్యక్తంచేశారు. నెల్లూరు జిల్లాలోని నేసేపేట గ్రామంలో, ఎన్టీఆర్‌ జిల్లా కేతనకొండ గ్రామంలోను పాఠశాలల విలీనంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం చిన్నఉల్లగల్లు ఎస్సీ కాలనీ పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు బైఠాయించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపైనే నిరసన తెలిపారు.  రాచర్ల మండలం యడవల్లి ఎస్సీకాలనీలోని పాఠశాల వద్ద విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనుమలపల్లి ఎంపీపీ స్పెషల్‌ స్కూలును యూపీ స్కూల్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.  


రాత్రికి రాత్రి ఆదేశాలు

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన ఎలా ఉన్నా పాఠశాలల విలీనంపై  విద్యాశాఖ మొండిగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులను కిలోమీటరు పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. మంగళవారం బడులు తెరుచుకుంటే సోమవారం రాత్రి హడావుడిగా ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం రాత్రి వరకు దీనిపై జిల్లాల అధికారులకు, ఉపాధ్యాయులకు స్పష్టత లేదు. రాత్రి ఆదేశాలు వచ్చిన వెంటనే హడావుడిగా విలీన ప్రక్రియను చేపట్టారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు పంపించారు. విజయనగరం జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలకు 75 మంది విద్యార్థులను పంపారు. కానీ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కరినే అప్పగించారు. అలాగే ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులుంటే వారికి 12 మంది ఉపాధ్యాయులు సరిపోతారని, అదనంగా ఉన్నారంటూ ముగ్గురు ఉపాధ్యాయులను వేరే పాఠశాలలు, స్కూల్‌ కాంప్లెక్స్‌లకు పంపారు. కొన్ని చోట్ల కొత్తగా వచ్చే విద్యార్థులు కూర్చునేందుకు గదులు లేకపోయినా విలీనం అంటూ చిన్నారులను తరలించారు.


ఇది దారుణం: ఏపీటీఎఫ్‌

ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టిన విలీన ప్రక్రియను ఏపీటీఎఫ్‌ ఖండించింది. పాఠశాలలను రక్షించుకునేందుకు తమతో పాటు ప్రజలకు ముందుకు రావాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజుల, కె. భానుమూర్తి, మాజీ ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాద్‌ పిలుపునిచ్చారు. జీవో 117 అమలుపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఏకపక్షంగా ఆదేశాలు జారీచేశారని విమర్శించారు.  


అర్ధరాత్రి ఉత్తర్వులా?: టీఎన్‌యూఎస్‌

పాఠశాలల విలీనంపై అర్ధరాత్రి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు అధికారులను ప్రశ్నించారు. విలీనంపై తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  


బడికి.. మంగళవారం అడ్డంకి మొదటి రోజు ఒకే ఒక్కడు!

అనంతపురం(విద్య): అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కేవీఎస్‌ నగర్‌లోని ఎంపీపీ పాఠశాలకు తొలిరోజు ఒకే ఒక విద్యార్థి హాజరయ్యాడు. ఈ పాఠశాలలో  కింది గదిలో 1, 2, 3 తరగతులు, పైగదిలో 4, 5 తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సర పునః ప్రారభానికి ప్రభుత్వం ‘మంగళవారాన్ని’ ఎంపిక చేసుకోవడంతో ఆ ప్రభావం హాజరుపై పడింది. ఈ పాఠశాలలో 1, 2, 3 తరగతులకు కలిపి రెండో తరగతి విద్యార్థి ఒక్కడే హాజరయ్యాడు.  



Updated Date - 2022-07-06T08:15:01+05:30 IST