Cellphone Battery Explodes : చేతిలో పేలిన సెల్‌ఫోన్.. వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం..
ABN , First Publish Date - 2022-08-19T01:15:35+05:30 IST
మీ చేతిలోని సెల్‌ఫోన్ (Cellphone) ఉన్నపళంగా పేలిపోయి.. మంటలు వెలువడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
భోపాల్ : మీ చేతిలోని సెల్‌ఫోన్ (Cellphone) ఉన్నపళంగా పేలిపోయి.. మంటలు వెలువడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో సెల్‌ఫోన్ రిపేర్ చేస్తున్న ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. షాప్‌కి వచ్చిన ఓ కస్టమర్‌తో మాట్లాడుతూ సెల్‌ఫోన్ రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా సెల్‌ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. శబ్దంతోపాటు మంటలు కూడా ఎగసిపడ్డాయి. దీంతో రిపేర్ చేస్తున్న యువకుడి బంటీ షాక్‌కు గురయ్యాడు. మంటలు వెలువడుతున్న ఫోన్‌ను పక్కకు గిరాటేశాడు. ఆ తర్వాత మంటలను ఆర్పివేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సెల్‌ఫోన్ పేలడాన్ని దగ్గర నుంచి చూసిన కస్టమర్ దూరంగా లగెత్తడం వీడియోలో కనిపించింది.
బాలాఘాట్లోని ‘బంటీ మొబైల్ షాప్’లో ఈ ఘటన చోటుచేసుకుంది. చేతిలోనే సెల్‌ఫోన్ పేలిన షాకింగ్ ఘటనపై షాప్ ఓనర్ బంటీ స్పందించాడు. పక్కకు విసిరేయడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పాడు. రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పేలిందని వివరించాడు. సెల్‌ఫోన్ ఉబ్బినట్టు కనిపించగానే రిపేర్ షాప్‌కు తీసుకెళ్లాలని బంటీ సూచించాడు. లేదంటే తనకు జరిగినట్టే చేతుల్లో సెల్ఫోన్లు పేలతాయని హెచ్చరించాడు. కాగా సెల్‌ఫోన్ పేలినప్పుడు దూరంగా వెళ్లిపోవాలంటూ కస్టమర్లకు బంటీ సూచించడం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూసేయండి..