Sep 16 2021 @ 13:35PM

అమెజాన్‌ ప్రైమ్‌లో ‘రామన్‌ అండాలుం రావణన్‌ ఆండాలుం’

ప్రముఖ తమిళ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై యంగ్‌ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ కోవలో తాజాగా నిర్మించిన చిత్రం ‘రామన్‌ అండాలుం రావణన్‌ ఆండాలుం’. ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షో ద్వారా ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన నటి రమ్యా పాండ్యన్‌, మరో నటి వాణీ భోజన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అరిసిల్‌ మూర్తి దర్శకుడు. ఈ చిత్ర కథ గురించి దర్శకుడు అరిసిల్‌ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ, ‘ఒక గ్రామం కథ. ఈ గ్రామం గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఆ గ్రామంలో ఇప్పటికీ కరెంట్‌ సదుపాయం లేదు. ఎటు చూసిన ఎండిపోయిన పొలాలే కనిపిస్తాయి. కనుచూపు మేరకు పచ్చని చెట్టు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. అలాంటి గ్రామంలో ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న రెండు గోవులు కనిపించకుండా పోతాయి. ఇది పెద్ద సమస్యగా మారి రాజకీయంగా పెను తుఫానుకు దారితీస్తుంది. కనిపించకుండా పోయిన ఆవులను కనిపెట్టారా? తద్వారా రాజకీయ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పడిందా? ఆవులు కనిపించకుండా పోవడానికి, రాజకీయ దుమారానికి లింకు ఏమిటి? తద్వారా ఈ గ్రామం అభివృద్ధికి నోచుకుందా? అన్నదే ఈ చిత్ర కథ. 

ఈ చిత్రంలో డీ గ్లామర్‌ పాత్రలో రమ్యాపాండ్యన్‌ పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించింది. వాణీ భోజన్‌ జర్నలిస్టు పాత్రలో నటించింది. క్రిష్‌ సంగీతం సమకూర్చిన ఈ మూవీని థియేటర్‌లో రిలీజ్‌ చేసేలా 2019లోనే షూటింగ్‌ ప్రారంభించాం. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అనేక కష్టాల మధ్య షూటింగ్‌ పూర్తి చేసి ఈ నెల 24వ తేదీన ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని చూసి హీరో సూర్య కుటుంబ సభ్యులు అభినందించడం చాలా సంతోషం వేసింది’ అని తెలిపారు. విలేకరుల సమావేశంలో నటి రమ్యా పాండ్యన్‌తో పాటు సంగీత దర్శకుడు క్రిష్‌ తదితరులు పాల్గొన్నారు.