ఓంకారోపాసన

ABN , First Publish Date - 2020-07-04T08:10:28+05:30 IST

ప్రణవాన్ని ఎలా ఉచ్చరించాలో తెలిపే ఉపనిషత్‌ వాక్యమిది. ఓంకారాన్ని తైలధార లాగా విరామం లేకుండా ఉచ్చరించాలి.

ఓంకారోపాసన

తైలధారా మివాచ్ఛిన్నం దీర్ఘఘంటా నినాదవత్‌



ప్రణవాన్ని ఎలా ఉచ్చరించాలో తెలిపే ఉపనిషత్‌ వాక్యమిది. ఓంకారాన్ని తైలధార లాగా విరామం లేకుండా ఉచ్చరించాలి. ఘంటానాదంలా మృదులంగా ప్రారంభించి, క్రమక్రమంగా శబ్దాన్ని పెంచి, తిరిగి మృదుల స్థాయికి తీసుకురావాలని దీని అరథం. ప్రణవం ఉచ్చారణ, ప్రణవోపాసన గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రణవాన్ని అర్థం చేసుకోవాలి. ప్రణవం అంటే నిత్యనూతనం అని అర్థం. ఓంకారాన్నే ప్రణవం అంటారు. ఓంకారంలో ‘అ’కారం, ‘ఉ’కారం, ‘మ’కారం, నాదబిందువులు ఉంటాయి. అవి వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశ్వర సదాశివ తత్వాలను బోధిస్తాయి. ‘ఓం’కారంలో ఉండే ‘అ’కారం సృష్టికి, ‘ఉ’కారం స్థితికి, ‘మ’కారం లయకారత్వానికి చిహ్నాలు. ఏ శబ్దం నుంచి అన్ని శబ్దాలూ వ్యక్తమవుతున్నాయో అదే ఓంకారం. సృష్టిలో మొట్టమొదట ఉద్భవించినది ఓంకార ధ్వని. త్రివేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం), త్రికాలాలు, త్రిధామాలు ఇవన్నీ ప్రణవం నుంచే పుట్టాయి. ‘ఓంకారం విస్తరించబడి గాయత్రీ మంత్రం అయింది’ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని విస్తరించి చెబుతూ.. ప్రణవం నుంచే పంచాక్షరీ మహామంత్రం, పంచాక్షరి నుంచి గాయత్రీ మంత్రం, గాయత్రి నుండి సర్వవేద సారస్వతం ఉద్భవించినట్లు శివపురాణం చెబుతోంది. 


ఓంకారంలో ఉండే మూడు అక్షరాలూ మనం మాట్లాడే మాటలకు కూడా సంకేతాలుగా నిలుస్తాయి. మన మాటల్లో నోరు తెరిచి పలికే అక్షరాలకు ‘అ’ సంకేతం. నోటి నుండి గాలి బయటకు ఊది పలికే అక్షరాలకు ‘ఉ’ సంకేతం. ఇక రెండు పెదవులనూ కలిపి పలికేఅక్షరాలకు ‘మ’ సంకేతం. సమస్త అక్షరాలు, శబ్దాలు ఈ మూడింటిలో ఏదో ఒక విధానంలోనే పలుకబడతాయి. ఆ రకంగా ఓంకారానికి, వాక్కుకు సంబంధం ఉంది. అలాగే.. ‘అ’కారంలో వృద్ధి, ‘మ’కారంలో జీవం నిక్షిప్తమై ఉంటాయని వైదిక విజ్ఞానుల నమ్మకం. సంస్కృత లిపిలో రాయబడిన ‘ఓం’ అనే అక్షరం వినాయకుని ప్రతిరూపంలా కనిపిస్తుంది. ఆ రకంగా ఓంకారం త్రిమూర్తుల తత్వాన్ని ప్రతిఫలింపజేయడంతోపాటు గణనాథుని రూపాన్నీ ప్రతిబింబింపజేస్తుంది.


నిత్యం 21 సార్లు ఓంకారాన్ని జపించడం వల్ల మన శరీరంలోని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ కోశాలు, పంచ ప్రాణాలు, మనసు.. వెరసి 21 తత్వాలు ఉత్తేజితమవుతాయి. ఓంకారాన్ని జపించేటప్పుడు.. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి, గొంతులో కొనసాగించి పెదవులతో ముగించాలని యోగాశాస్త్రంలోని ‘ఓంకారోపాసన’ చెబుతుంది. ప్రణవోపాసన వలన మానవ శరీరంలోని 72 వేల నాడులు ఉత్తేజితమవుతాయి. ఓంకారోపాసనలో.. ‘అ’కారం ఉచ్చరిస్తున్నప్పుడు హృదయకమలం ముకుళించుకుంటుంది. ‘ఉ’కారానికి విస్తరిస్తుంది. ‘మ’కారానికి నాదం వెలువడుతుంది. అందుచేత ప్రణవాన్ని ఉచ్చరించడం, ప్రణవాన్ని ఉపాసించడం.. రెండింటి వల్ల ఆయా స్థాయుల్లో పుణ్యం లభిస్తుంది. ప్రణవోచ్చారణ గృహస్థులకు, ప్రణవోపాసన యోగులకు శ్రేష్ఠం.



- పమిడి కుమార శేఖర్‌, 9491670003

Updated Date - 2020-07-04T08:10:28+05:30 IST