కరోనా Omicron variant డెల్టా కంటే తక్కువ ప్రాణాంతకం...వైద్యనిపుణుల వెల్లడి

ABN , First Publish Date - 2021-11-29T15:03:55+05:30 IST

దక్షిణాఫ్రికాలో ప్రబలిన కరోనా ఒమైక్రాన్ కొత్త వేరియెంట్ డెల్టా వేరియెంట్ కంటే తక్కువ ప్రాణాంతకమని వైద్యనిపుణులు వెల్లడించారు....

కరోనా Omicron variant డెల్టా కంటే తక్కువ ప్రాణాంతకం...వైద్యనిపుణుల వెల్లడి

 జోహెన్స్ బర్గ్: దక్షిణాఫ్రికాలో ప్రబలిన కరోనా ఒమైక్రాన్ కొత్త వేరియెంట్ డెల్టా వేరియెంట్ కంటే తక్కువ ప్రాణాంతకమని వైద్యనిపుణులు వెల్లడించారు.కొత్త వైరస్ లక్షణాలు అసాధారణమైనా తేలికపాటివేనని నిపుణులు పేర్కొన్నారు. ఈ కొవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ బాధితులతో దక్షిణాఫ్రికా ఆస్పత్రులు, ఆరోగ్యకేంద్రాలూ కిటకిటలాడుతున్నాయి. అయితే, ఈ వేరియంట్ బారిన పడిన వారిలో అంతుబట్టని లక్షణాలు కనబడుతున్నప్పటికీ, వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటోందని తెలుస్తోంది. ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో అది కొంత ఊరటనిచ్చే విషయం. జోహెన్స్ బర్గ్ ప్రాంతంలో కొవిడ్ బారిన పడినవారిలో 90 శాతం మంది ఒమైక్రాన్ వేరియెంట్ బాధితులే. అయితే, ఈ వేరియెంట్ వల్ల మరణించే వారి సంఖ్య తక్కువగానే ఉందని స్థానిక మీడియా నివేదించింది.



తేలికపాటి లక్షణాలు

దక్షిణాఫ్రికా దేశం అంతటా కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ వైరస్ వందలాది మందికి సోకింది.ఈ కొత్త వేరియెంట్ సోకిన వ్యక్తుల్లో వికారం, తలనొప్పి, అలసట, అధిక పల్స్ రేటు ఉందని వైద్యులంటున్నారు.అయితే ఈ వేరియెంట్ వల్ల ఎవరూ రుచి లేదా వాసన కోల్పోలేదు.చాలా మంది ఒమైక్రాన్ సోకిన రోగులకు కేవలం తీవ్రమైన తలనొప్పి, వికారం లేదా మైకం ఉన్నట్లు దక్షిణాఫ్రికాలోని ఎక్కువ మంది వైద్యులు ధృవీకరించారు.ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని,ఈ కొత్త కొవిడ్ వేరియంట్ యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఇటలీ, కెనడా దేశాల్లో వ్యాపించింది.


బూస్టర్ డోసు తీసుకోవాలి

తాను గతంలో చికిత్స చేసిన కొవిడ్ రోగుల లక్షణాలతో పోలిస్తే ఒమైక్రాన్ రోగుల లక్షణాలు చాలా భిన్నంగా తేలికపాటివని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు. డెల్టా వేరియెంట్ తో పోలిస్తే ఒమైక్రాన్ తక్కువ వ్యాధికారకమైందని వైరాలజిస్ట్ మార్క్ వాన్ రాన్స్ట్ చెప్పారు. ఒమైక్రాన్ వేరియెంట్‌కు వ్యతిరేకంగా క్షీణిస్తున్న రోగనిరోధకశక్తిని పెంచడానికి బూస్టర్ మోతాదు వేయించుకోవాలని యూకే చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ సర్ పాట్రిక్ వాలెన్స్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టిలు సూచించారు. బూస్టర్ డోసు వేయించుకోవడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, కఠినమైన కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని వైద్యనిపుణులు సూచించారు.


Updated Date - 2021-11-29T15:03:55+05:30 IST