ఒమైక్రాన్ రెండు సార్లు సోకుతుందా.. ?

ABN , First Publish Date - 2022-01-16T01:48:21+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే వ్యక్తి రెండు మార్లు కరోనా బారినపడతారా (రీఇన్ఫెక్షన్) అనేది ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ప్రశ్న. అయితే..

ఒమైక్రాన్ రెండు సార్లు సోకుతుందా.. ?

ఇంటర్నెట్ డెస్క్: ఒమైక్రాన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా వేరియంట్ ఇది. అనేక దేశాల్లో ఒమైక్రాన్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగి.. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. ఒమైక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే వ్యక్తి రెండు మార్లు కరోనా  బారినపడతారా (రీఇన్ఫెక్షన్) అనేది ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ప్రశ్న. అయితే.. రీఇన్ఫెక్షన్ సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఒమైక్రాన్ సోకిన తొలిసారి వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో ఉద్దీపన చెందని సందర్భాల్లో మరోమారు దీని బారిన పడే అవకాశం కచ్చితంగా ఉంటుందని  అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫేగల్ తెలిపారు. ఇక రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండే (ఇమ్యూనోకాంప్రమైజ్డ్) వ్యక్తుల్లోనూ ఒమైక్రాన్ రీఇన్ఫెక్షన్‌కు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ‘‘రెండు మార్లు ఒమైక్రాన్ బారినపడ్డ ఘటనలు ఇటీవల కొన్ని వెలుగు చూశాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 


‘‘ఒమైక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.. అయితే.. రోగిలోని ఇమ్యూనిటీని మాత్రం కావాల్సిన స్థాయిలో స్టిమ్యులేట్ చేయట్లేదు. ఫలితంగా మరోమారు ఒమైక్రాన్ బారిన పడే అవకాశం ఉంది’’ అని న్యూజెర్సీ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్త స్టాన్లీ వైస్ పేర్కొన్నారు. సాధారణంగా ఓ వ్యక్తికి వ్యాధి సోకిన అనంతరం..రోగ నిరోధకశక్తి పూర్తిస్థాయిలో ఉద్దీపన చెంది మరోమారు అదే వ్యాధి బారినపడకుండా రక్షిస్తుంది. అంటువ్యాధుల విషయంలో సాధారణంగా కనిపించే దృశ్యం ఇది. అయితే..ఒమైక్రాన్ విషయంలో మాత్రం ఇది ఆశించిన స్థాయిలో జరగట్లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-01-16T01:48:21+05:30 IST