ఒమైక్రాన్‌.. దారితప్పిన వేరియంట్‌!

ABN , First Publish Date - 2022-01-17T09:34:26+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి పురోతి క్రమంలో ఒమైక్రాన్‌ ఒక దారితప్పిన, తల్లి, తండ్రి లేని అక్రమ సంతానంలాంటి వేరియంట్‌ అని ప్రముఖ వైరాలజిస్టు, సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ ఇన్‌ వైరాలజీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.జాకబ్‌ జాన్‌ అభివర్ణించారు.

ఒమైక్రాన్‌.. దారితప్పిన వేరియంట్‌!

న్యూఢిల్లీ, జనవరి 16: కొవిడ్‌ మహమ్మారి పురోతి క్రమంలో ఒమైక్రాన్‌ ఒక దారితప్పిన, తల్లి, తండ్రి లేని అక్రమ సంతానంలాంటి వేరియంట్‌ అని ప్రముఖ వైరాలజిస్టు, సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ ఇన్‌ వైరాలజీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.జాకబ్‌ జాన్‌ అభివర్ణించారు. అయితే, వూహాన్‌లో పుట్టిన డి614జీ వేరియంట్‌ను మాత్రం ఒమైక్రాన్‌కు ముత్తాత తాతలాంటిదని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రస్తుతం ప్రపంచమంతా రెండు మహమ్మారుల ముట్టడిలో ఉందని ఆయన వెల్లడించారు. ఒకటి.. పాత వూహాన్‌ వేరియంట్‌, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, కప్పా, మ్యూ తదితర వేరియంట్లతో కూడిన కరోనా మహమ్మారి అయితే, రెండోది ఒమైక్రాన్‌ మహమ్మారి అని జాకబ్‌ వివరించారు. ఈ రెండు మహమ్మారులు కలిగించే ఆరోగ్య సమస్యలు కూడా వేర్వేరుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 


ఒక మహమ్మారి (డెల్టా తదితరాలతో కూడినది) న్యూమోనియా, హైపోక్సియా (ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోవడం), శరీరంలోని అవయవాల వైఫల్యానికి కారణమవుతుంటే.. మరొకటి శ్వాసకోశ వ్యాధిని మాత్రమే కలగజేస్తోందని పేర్కొన్నారు. కొన్ని మెట్రో నగరాల్లో కేసులు నిలకడగా ఉన్న నేపథ్యంలో మూడో వేవ్‌ పతాకస్థాయికి చేరినట్టేనా? అని ప్రశ్నించగా.. నగరాల్లో మొదలైన మూడో వేవ్‌ తొలుత నగరాల్లోనే ముగుస్తుందని చెప్పారు. ఒమైక్రాన్‌ తర్వాత వచ్చే వేరియంట్లు దీనిలాగానే అంత హానికరం కానివిగా ఉంటాయనే హామీ లేదని బోస్టన్‌ వర్సిటీ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఒమైక్రాన్‌ స్థానికవ్యాప్తి పెరిగిందని వెల్లడైంది. ఢిల్లీలోని 5 జిల్లాల్లో గత ఏడాది నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య వారు 264 నమూనాలు సేకరించి పరీక్షించగా అందులో 182 డెల్టా వేరియంట్‌వేనని తేలింది. 82 మంది ఒమైక్రాన్‌ బారిన పడగా వారిలో 32 (39.1ు) మందికి మాత్రమే విదేశీ ప్రయాణ చరిత్ర ఉంది. మిగతా 50 (60.9ు) మందికీ ఆ చరిత్ర లేదు.

Updated Date - 2022-01-17T09:34:26+05:30 IST