Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 3 2021 @ 02:26AM

ఒమైక్రాన్‌.. జరభద్రం

 • దేశంలోకి వేరియంట్‌.. ఇద్దరికి నిర్ధారణ
 • ఒకరు దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక వచ్చిన వ్యక్తి.. 
 • మరొకరు బెంగూళరు నగరానికి చెందిన వైద్యుడు
 • గత నెల 20న విదేశీయుడి రాక.. కరోనా నిర్ధారణ
 • కొత్త వేరియంట్‌ నేపథ్యంలో నమూనాల సేకరణ
 • ఐసొలేషన్‌లో ఉండకుండా దుబాయ్‌కు పయనం
 • జన్యు విశ్లేషణ ఫలితాల్లో బయటపడిన ఒమైక్రాన్‌
 • హెల్త్‌ వర్కర్‌ కాంటాక్టుల్లో ఐదుగురికి పాజిటివ్‌
 • ఒమైక్రాన్‌ వేరియంట్‌ సంక్రమణ చాలా ఎక్కువ
 • డెల్టా కంటే రెట్టింపు స్పైక్‌ మ్యుటేషన్లు: లవ్‌అగర్వాల్‌
 • నార్వేలో క్రిస్మస్‌ పార్టీతో 50 మందికి ఒమైక్రాన్‌!


ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గుబులు పుట్టిస్తున్న ఒమైక్రాన్‌ మన దేశంలోనూ అడుగు పెట్టింది. బెంగళూరులో ఇద్దరికి గురువారం ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరికొందరు విదేశీ ప్రయాణికుల నమూనాల జన్యు విశ్లేషణ ఫలితాలు రావాల్సి ఉంది. దాంతో, ఒమైక్రాన్‌ కేసులు నమోదైన దేశాల సంఖ్యకు 30కి చేరింది. ఇక, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మరొకరికి కూడా పాజిటివ్‌ వచ్చింది. అయితే, అది ఏ వేరియంట్‌ అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.


న్యూఢిల్లీ, బెంగళూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక నుంచి సేకరించిన నమూనాల జన్యు విశ్లేషణలో కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయింది. వీరిలో ఒక వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు (66) కాగా, మరొకరు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేని బెంగళూరు వైద్యుడు (44). దక్షిణాఫ్రికా దేశస్థుడు నవంబరు 20న దుబాయ్‌ మీదుగా భారత్‌కు వచ్చాడు. కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రంతో బెంగళూరు చేరుకున్న అతడికి అదే రోజు పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఐసొలేట్‌ కావాలని ప్రభుత్వ వైద్యుడు సూచించారు. గత నెల 22న నమూనాను జన్యు విశ్లేషణకు పంపారు. అయితే, నవంబరు 27 అర్థరాత్రి అతడు క్యాబ్‌ బుక్‌ చేసుకుని హోటల్‌ నుంచి దుబాయ్‌ వెళ్లిపోయాడు. ప్రయాణానికి అడ్డంకి లేకుండా ప్రైవేటు ల్యాబ్‌ నుంచి కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం పొందాడు. మరోవైపు ఇతడు టీకా రెండు డోసులూ పొందాడు. తన కాంటాక్టులందరికీ పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చింది. ఇక బెంగళూరు వైద్యుడికి నవంబరు 22న కరోనా నిర్ధారణ అయింది. మూడు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఈయన 13 మంది ప్రత్యక్ష, 250 ద్వితీయ కాంటాక్టులను ట్రేస్‌ చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. మరోవైపు ఢిల్లీ వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.


పూర్తిస్థాయి అప్రమత్తత పాటించండి 

ఒమైక్రాన్‌ వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైను ఢిల్లీకి పిలిపించింది. బూస్టర్‌ డోస్‌పై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు సీఎం పేర్కొన్నప్పటికీ ఆయన ఢిల్లీలో ఉన్న సమయంలోనే  బెంగళూరులో రెండు ఒమైక్రాన్‌ కేసులు వెలుగు చూసినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత అనుభవాల రీత్యా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధించే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. పరిస్ధితులు మళ్లీ లాక్‌డౌన్‌ దిశలో సాగుతున్నట్లు సమాచారం. సీఎం బొమ్మై శుక్రవారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాగా, కర్ణాటక శాంపిళ్లలో ఒమైక్రాన్‌ను గుర్తించినట్లు గురువారం కేంద్రం తెలిపింది.


ఇద్దరిలోనూ లక్షణాలు స్వల్పమేనని ప్రకటించింది. కాంటాక్టులందరినీ గుర్తించామని, పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఒమైక్రాన్‌ కేసులు బయటపడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరమేనీ లేదని, జాగ్రత్తలు మాత్రం విస్మరించొద్దని ప్రజలకు సూచించారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువని తెలిపారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే దీనిలో రెండు రెట్లు చెడు(బ్యాడ్‌) స్పైక్‌ మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. వివిధ దేశాలతో పాటు మన దేశంలో నమోదైన కేసుల్లో వ్యాధి లక్షణాలు స్వల్పమేనని పేర్కొన్నారు. ‘‘ఈ వేరియంట్‌లో 45-52కు పైగా మ్యుటేషన్లు, దీని స్పైక్‌లో 26-32 మార్పులు గుర్తించారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే మన శరీర కణాలకు అంటుకునే తత్వం దీనికి ఎక్కువగా ఉంది’’ అని లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. కాగా, బూస్టర్‌ అవసరంపై శాస్త్రీయ పరిశోధన చేస్తున్నామని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

 

విమానాశ్రయ, నౌకాశ్రయ అధికారులతో సమీక్ష

ఒమైక్రాన్‌ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం విమానాశ్రయ, నౌకాశ్రయ అధికారులతో సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు, పర్యవేక్షణపై సమీక్షించారు. కాగా, కొవిడ్‌ చికిత్స కోసం అభివృద్ధి చేసిన సాట్రోవిమాబ్‌ మందుకు బ్రిటన్‌ ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చికిత్సా విధానం ఒమైక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లపై కూడా సమర్థంగా పనిచేస్తుందని ఆ దేశ ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ భావిస్తోంది. 

Advertisement
Advertisement