Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్ఫ్‌లోని భారత ప్రవాసుల్లో Omicron గుబులు.. ప్రయాణాలపై ఆంక్షలతో..

సౌదీ, యూఏఈలో ఒక్కో కేసు నమోదు

రాకపోకలపై మరోసారి అనిశ్చిత పరిస్థితి

విమానాల రద్దు?.. వెంటాడుతున్న భయం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌లో ఉంటున్న భారతీయ ప్రవాసులను ఒమైక్రాన్‌ వణికిస్తోంది. ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన తర్వాత ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయని భావిస్తున్న తరుణంలో కొత్త రకం కరోనా మరో సారి భయపెడుతోంది. ఆఫ్రికా దేశాలను సందర్శించి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ను గుర్తించినట్లుగా సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలు ప్రకటించడం.. పూర్తి స్ధాయి విమానాల పునరుద్ధరణ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ప్రవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరీ అత్యవసరమైతే తప్ప భారత్‌కు ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. తీరా అక్కడికి వెళ్లాక హఠాత్తుగా విమానాలను రద్దు చేస్తే ఇరుక్కుపోయి ఉద్యోగాలు కోల్పోతామని భయపడుతున్నారు. భారతీయుల రాకపై 20 నెలలకుపైగా ఉన్న ఆంక్షలను తొలగించిన రోజే సౌదీలో ఒమైక్రాన్‌ కేసు బయటపడడం, పూర్తి స్థాయిలో విమానాలను నడపడానికి అనుమతి ఇవ్వాలని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఒత్తిడి తీసుకొస్తున్న తరుణంలో అక్కడా ఓ కేసు నమోదవడం కలకలం రేపుతోంది. 

ఒమైక్రాన్‌ విజృంభిస్తే ఏ క్షణంలోనైనా గల్ఫ్‌-భారత్‌ మధ్య ప్రయాణానికి ఆటంకం కలుగుతుందని ప్రవాసులు ఆందోళన చెందుతున్నారు. గత శనివారం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నానని హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ఫసియుల్లా ఖాన్‌ చెప్పారు. మాతృదేశానికి వెళ్లాలని ఆశగా ఉన్నా అనిశ్చిత పరిస్థితి కారణంగా వెనుకంజ వేస్తున్నట్లు వరంగల్‌ జిల్లాకు చెందిన టి.బలరాం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన అనిల్‌ కుమార్‌ తెలిపారు. కరోనా భయంతో రెండేళ్లుగా మాతృదేశంలోని పిల్లలను చూడడానికి సైతం వెళ్లలేదని తిరుపతికి చెందిన మమత ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది తెలుగు ప్రవాసులు తమ ప్రయాణాలపై పునరాలోచనలో పడినట్లు దుబాయ్‌లోని డైమండ్‌ ట్రావెల్స్‌ ఏజన్సీ నిర్వాహకుడు మద్దూరి స్వామిరెడ్డి పేర్కొన్నారు. కరోనా కారణంగా దుబాయి-హైదరాబాద్‌ సెక్టార్‌లో విమాన టికెట్‌ ధర మూడింతలు పెరిగిందని, మున్ముందు ఏదైనా ఆటంకం ఏర్పడితే చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కువైత్‌, సౌదీ దేశాలు గత ఏడాది నుంచి భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. 14 రోజుల క్వారంటైన్‌తో ఇతర దేశాల మీదుగా ప్రయాణం చేసి రావాల్సి ఉండడంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. దుబాయిలో ఎక్స్‌పో, సౌదీలో రియాద్‌ సీజన్‌ కార్యక్రమాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే విమానాల రాకపోకలపై సడలింపులు ఇస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ వచ్చే వారం సౌదీలో ప్రదర్శనకు వస్తుండగా.. దుబాయ్‌ ఎక్స్‌పోను ప్రధాని మోదీ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒమైక్రాన్‌ విజృంభిస్తే మరోసారి లాక్‌డౌన్‌ నాటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement