భారత్‌లో ఒమైక్రాన్ ప్రవేశం... కర్ణాటకలో రెండు కేసులు...

ABN , First Publish Date - 2021-12-02T22:24:28+05:30 IST

తీవ్ర కలకలం రేపుతున్న కోవిడ్-19 వైరస్ కొత్త రూపాంతరం

భారత్‌లో ఒమైక్రాన్ ప్రవేశం... కర్ణాటకలో రెండు కేసులు...

న్యూఢిల్లీ : తీవ్ర కలకలం రేపుతున్న కోవిడ్-19 వైరస్ కొత్త రూపాంతరం ఒమైక్రాన్ భారత్‌లో ప్రవేశించింది. కర్ణాటకలో ఇద్దరికి ఇది సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ధ్రువీకరించింది. వేగంగా వ్యాపించే ఈ కేసులు మన దేశంలో నమోదవడం ఇదే తొలిసారి. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. ఈ రెండు కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు ఈ వైరస్ బాధితులని తెలిపారు. వీరిలో ఒకరు నవంబరు 11న, మరొకరు నవంబరు 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిపారు. అయితే ఒమైక్రాన్ లక్షణాలు మన దేశంలో ఇప్పటి వరకు మరీ అంత తీవ్రంగా లేవని చెప్పారు. ఈ వైరస్‌కు సంబంధించిన కేసులన్నిటిలోనూ చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన ఈ కేసుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలపై అధ్యయనం జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. 


ఒమైక్రాన్ రూపాంతరాన్ని మొదట దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో గుర్తించారు. ఆ తర్వాత ఇది సుమారు 10 దేశాలకు వ్యాపించింది. ఇది మరింత విస్తరించకుండా మన దేశం కఠిన చర్యలు అమలు చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి పెట్టింది. 


ఇదిలావుండగా, కర్ణాటకలో ఒమైక్రాన్‌కు గురైనవారు ఇద్దరూ విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-12-02T22:24:28+05:30 IST