Chitrajyothy Logo
Advertisement

పెద్ద సినిమాలన్నీ ‘వాయిదా’!

twitter-iconwatsapp-iconfb-icon
పెద్ద సినిమాలన్నీ వాయిదా!

మళ్లీ సినిమా ఇండస్ట్రీకి కష్టకాలం మొదలైంది. కరోనా రూపంలో ఇప్పటికే రెండు సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా ఇండస్ట్రీ.. ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ రూపంలో మరోసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పెద్ద సినిమాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాల పరిస్థితి అయితే దిక్కుతోచని విధంగా తయారైంది. ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోని ఉత్తరాది రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌, కర్ఫ్యూ‌లు మొదలయ్యాయి. ప్రజలు కూడా భయాందోళనలో ఉన్నారు. ఇటువంటి అనివార్య పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేయడం సబబు కాదని భావించి.. పాన్ ఇండియా సినిమాలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాల మేకర్స్ అధికారికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వచ్చే నెల రాబోయే ‘ఆచార్య, భీమ్లా నాయక్’ వంటి పెద్ద చిత్రాలు కూడా వాయిదా పడతాయని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ చర్చకు కారణాలు లేకపోలేదు.


తెలుగు సినిమా బిజినెస్‌లో 20 నుండి 40 శాతం వరకు పాత్ర వహిస్తున్న ఓవర్సీస్ మార్కెట్ పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో అయితే రోజుకి 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటం చూస్తుంటే.. అక్కడ థర్డ్ వేవ్ మొదలైనట్లుగానే భావిస్తూ.. అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఓవర్సీస్‌లో పరిస్థితులు నార్మల్ అవడానికి చాలా సమయమే పట్టేట్లు ఉంది. రీసెంట్‌గా వచ్చిన ‘పుష్ప’ చిత్రం అక్కడ మంచి బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. అటువంటి బిజినెస్‌ని ఎవరూ కోల్పోవాలని అనుకోరు కాబట్టి.. పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూడక తప్పదు.  

పెద్ద సినిమాలన్నీ వాయిదా!

ఇక ఇండియా విషయానికి వస్తే.. ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఒమైక్రాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. విపరీతంగా కేసులు పెరిగిపోతుండటంతో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ముంబై వంటి చోట ప్రభుత్వాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ అంటూ ఆంక్షలు మొదలెట్టాయి. చాలా చోట్ల స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు మూతపడ్డాయి. ఇతరత్రా వాటిపై కూడా ఆంక్షలు మొదలయ్యాయి. ఇటువంటి పరిస్థితులలో పాన్ ఇండియా సినిమాలే కాదు.. పెద్ద సినిమాలను కూడా థియేటర్లలోకి తీసుకు వచ్చే సాహసం నిర్మాతలు చేయరు. అందులోనూ ఈ నెలాఖరుకి ఒమైక్రాన్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లుగా సైంటిస్ట్‌లు సైతం చెబుతున్నారు. గతంలోని వేరియంట్స్ కంటే ఒమైక్రాన్ వ్యాప్తి తీవ్రతరంగా ఉందని వార్తలు వస్తున్న తరుణంలో ప్రజలు కూడా భయాందోళనలతో బయటికి వెళ్లలేని పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ‘ఆచార్య’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలపై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిత్రాలు ఇప్పుడు ప్రకటించిన టైమ్‌కి రావడం కష్టమే.


అందులోనూ తెలుగు రాష్ట్రాలలో కాస్త పరిస్థితులు బాగున్నాయని అనుకున్నా.. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం టికెట్ల ధర విషయంలో సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా లేదు. కొన్ని నెలలుగా ఏపీలో తెలుగు సినిమా ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడప్పుడే ఈ పంచాయితీ ముగియదని ఏపీ ప్రభుత్వ వ్యవహారతీరు చెబుతూనే ఉంది. ఇక తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉన్నా.. ఇప్పుడున్న భయాందోళనలతో ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? అనేది ప్రశ్నార్థకం. ఇంత రిస్క్ కనిపిస్తుంటే.. చూస్తూ చూస్తూ పెద్ద సినిమాలను థియేటర్లలోకి తీసుకురావడానికి ఏ నిర్మాత ముందుకు రారు. కాబట్టి పెద్ద సినిమాలన్నీ మరోసారి వాయిదా పడటం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలను ఓటీటీలలో విడుదల చేసే సాహసం ఎలాగూ చేయరు కాబట్టి.. ఒమైక్రాన్ వైరస్ వ్యాప్తి తగ్గి,  పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప ఈ చిత్రాలు విడుదలయ్యే మార్గం లేదు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement