ఒమైక్రాన్‌‌ను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలి : సీఎం జగన్

ABN , First Publish Date - 2021-12-28T01:18:23+05:30 IST

ఒమైక్రాన్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్‌. జగన్‌ అధికార యంత్రాంగాన్నిఆదేశించారు.

ఒమైక్రాన్‌‌ను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలి : సీఎం జగన్

అమరావతి: ఒమైక్రాన్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ అధికార యంత్రాంగాన్నిఆదేశించారు. సోమవారం వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్లనాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగాల్లోని ఆస్పత్రులు కూడా ఒమైక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌ ఉధృతం చేయాలని  అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలన్నారు.  ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలన్నారు. రాష్ట్రంలో 6 ఒమైక్రాన్‌ కేసులున్నాయని అధికారులు సీఎంకి తెలిపారు. వీరిలో ఎవ్వరూ కూడా ఆస్పత్రిపాలు కాలేదన్నారు.


అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం భయాందోళన అవసరం లేదని సీఎం అన్నారు. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతరత్రా ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. 


ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధులపైన బూస్టర్‌డోస్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. విదేశాలనుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్‌ చేయాలన్నారు. వారికి క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా పరీక్షలు జరపాలన్నారు. పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌కు కూడా వెంటనే పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్‌ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలన్నారు. ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

Updated Date - 2021-12-28T01:18:23+05:30 IST