ఒమైక్రాన్‌పై టీకాలు పనిచేస్తాయ్‌

ABN , First Publish Date - 2021-12-04T06:34:03+05:30 IST

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఒమైక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతను నిరోధించలేవని చెప్పడానికి ఆధారాలేవీ ...

ఒమైక్రాన్‌పై టీకాలు పనిచేస్తాయ్‌

ప్రభావం కొంత తగ్గొచ్చు:కేంద్ర ఆరోగ్యశాఖ 

న్యూఢిల్లీ, డిసెంబరు 3: ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఒమైక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతను నిరోధించలేవని చెప్పడానికి ఆధారాలేవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ఆందోళన కారక వేరియంట్‌ (వీవోసీ)గా పేర్కొన్నప్పటికీ.. ఇన్నాళ్లుగా కొవిడ్‌కు తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఒమైక్రాన్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ‘తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ)’ పేరిట పత్రాన్ని విడుదల చేసింది. అవేంటో చూస్తే..

 సార్స్‌-కొవ్‌-2లో కొత్త వేరియంట్‌ అయిన ఒమైక్రాన్‌ను దక్షిణాఫ్రికాలో నవంబరు 24న గుర్తించారు. ఈ వేరియంట్‌లో 30కిపైగా ఉత్పరివర్తనాలు స్పైక్‌ ప్రొటీన్‌పై సంభవించాయి. ఇన్ని మ్యుటేషన్లు ఉండడం, కేసుల సంఖ్య వేగంగా పెరగడం వల్ల డబ్ల్యూహెచ్‌ఓ దీన్ని ఆందోళనకరమని ప్రకటించింది.

 ప్రస్తుతం కరోనా పరీక్షకు వాడుతున్న ఆర్టీపీసీఆర్‌ టెస్టు, వైర్‌సలోని నిర్ణీత జన్యువులు.. స్పైక్‌ (ఎస్‌), న్యూక్లియోకాప్సిడ్‌ (ఎన్‌) వంటివాటిని గుర్తిస్తుంది. ఒమైక్రాన్‌లో స్పైక్‌ (ఎస్‌) జీన్‌లో భారీగా ఉత్పరివర్తనాలు ఉన్నందున.. జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ తప్పనిసరి.

 భారీ ఉత్పరివర్తనాల వలన ఒమైక్రాన్‌ వ్యాప్తి వేగం ఎక్కువ. అలాగే.. రోగనిరోధక శక్తిని తప్పించుకుని ఇన్ఫెక్షన్‌ను కలిగించే శక్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు పూర్తి ఆధారాలు ఇంకా లేవు.

 ఒమైక్రాన్‌ వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్‌ తీవ్రతపై ఇంకా ఒక స్పష్టత లేదు. భారత్‌లో తక్కువగానే ఉండొచ్చు.

 ఒమైక్రాన్‌ స్పైక్‌ జీన్‌లో పలు ఉత్పరివర్తనాలు సంభవించిన నేపథ్యంలో, ప్రస్తుత టీకాల ప్రభావం దీని మీద తక్కువగా ఉండొచ్చుగానీ.. పూర్తిగా పనిచేయవనడానికి ఆధారాలేవీ లేవు. అర్హులైనవారందరూ వ్యాక్సిన్లను తప్పనిసరిగా వేయించుకోవడం మంచిది. భారత ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. వైద్యనిపుణులు దీని లక్షణాలను గుర్తించి ఔషధాలను తయారుచేసే పనిలో ఉన్నారు.

Updated Date - 2021-12-04T06:34:03+05:30 IST