ఒమైక్రాన్‌.. ‘పరమ’ రహస్యం !

ABN , First Publish Date - 2022-01-23T07:33:17+05:30 IST

ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తున్న ‘ఒమైక్రాన్‌’ వేరియంట్‌ వలన ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెద్దగా లేనప్పటికీ, భారీగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వేగంగా వ్యాపించేలా ఒమైక్రాన్‌...

ఒమైక్రాన్‌.. ‘పరమ’ రహస్యం !

తొలిసారిగా పరమాణు స్థాయిలో కొత్త వేరియంట్‌ విశ్లేషణ 

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తున్న ‘ఒమైక్రాన్‌’ వేరియంట్‌ వలన ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెద్దగా లేనప్పటికీ, భారీగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వేగంగా వ్యాపించేలా ఒమైక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్‌ నిర్మాణాన్ని తొలిసారిగా కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు పరమాణు స్థాయిలో విశ్లేషించారు. వారిలో భారత సంతతికి చెందిన డాక్టర్‌ శ్రీరాం సుబ్రమణ్యం కూడా ఉన్నారు. ముందు వేరియంట్లతో పోలిస్తే.. ‘ఒమైక్రాన్‌’ మానవ శరీర కణాలను చాలా బలంగా పట్టుకుంటోందని ఆయన తెలిపారు. అందులో జరిగిన ఆర్‌493, ఎస్‌496, ఆర్‌498 అనే కొత్త ఉత్పరివర్తనాల కారణంగా మానవ రోగ నిరోధక వ్యవస్థకు చెందిన యాంటీబాడీలు దాన్ని బంధించలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త ఉత్పరివర్తనాలు ఒమైక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్‌కు, మానవ శరీర కణంపై ఉండే ఏసీఈ-2 రిసెప్టర్‌కు మధ్యలో కొత్త సాల్ట్‌ బ్రిడ్జ్‌లు, హైడ్రోజన్‌ బాండ్‌లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. ఫలితంగా వాటిని అడ్డదారిగా మార్చుకొని, యాంటీబాడీలను చిక్కకుండా మానవ శరీర కణంలోకి చొరబడుతోందని వివరించారు. ఈ మేరకు అధ్యయన నివేదిక ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

Updated Date - 2022-01-23T07:33:17+05:30 IST