Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కలకలం!

శృంగవరపుకోట రూరల్‌, డిసెంబరు 6: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ రాష్ట్రంలోనూ కలకలం రేపింది. ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు సోకింది సాధారణ వైరస్సా లేక ఒమైక్రానా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగాడు. అక్కడ పరీక్షలు చేయించుకోకుండా నేరుగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఎస్‌.కోట మండలంలోని అత్తవారింటికి వచ్చాడు.  ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు విజయనగరం వైద్యఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వడంతో మూడు రోజుల కిందట వైద్య సిబ్బంది వచ్చి ఆ వ్యక్తితోపాటు, ఆయన భార్య, అత్త నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వాటిని పరీక్షించగా ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు ఆదివారం రిపోర్టు వచ్చింది. ఒమైక్రాన్‌ అనుమానంతో శాంపిల్స్‌ను హైదరాబాద్‌ పంపించారు. దీంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. హోం క్వారెంటైన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించినా.. ఆయన పట్టించుకోకుండా.. వేపాడ మండలంలోని సొంతింటికి వెళ్లాడు. అక్కడ నుంచి విశాఖపట్నం మధురువాడ వెళినట్లు సమాచారం. 


కొత్తగా 122 కరోనా కేసులు 

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్‌తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,73,852కి, మరణాల సంఖ్య 14,453కి పెరిగిందని వైద్యఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. ఇప్పటివరకు 20,57,369 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,030 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Advertisement
Advertisement