Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్రమత్తతే ఔషధం

కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’పై అధికారుల అటెన్షన్‌

విదేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి 

గన్నవరం ఎయిర్‌పోర్టులో వైద్య బృందాలు 

ఇంటింటి సర్వే.. వ్యాక్సినేషన్‌ వేగవంతం 

భయం కాదు.. అవగాహన ముఖ్యం

విదేశాల నుంచి రాకపోకలను నియంత్రించడమే మేలు


మళ్లీ కరోనా కలవరం మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తిచెందుతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులూ అప్రమత్తమయ్యారు. ఇప్పటికి రెండు దశల్లో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ప్రజలు క్రమంగా తేరుకుంటున్న తరుణంలో మళ్లీ ఒమైక్రాన్‌ తరుముకొస్తుందనే హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకోవడం, ఆహార నియమాలనూ, కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించడం ద్వారా వైరస్‌ బారినపడకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికంటే ముందుగా విదేశాల నుంచి రాకపోకలను నియంత్రించడం ద్వారా ప్రభుత్వం ఈ వేరియంట్‌ వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచిస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) కొత్తగా పుట్టుకొచ్చిన ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిపై హెచ్చరికలు వెలువడుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా విదేశాల నుంచి జిల్లాకు వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు జిల్లా ప్రజలు కూడా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. కలెక్టర్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అయితే విదేశాల నుంచి ఈ వైరస్‌ లక్షణాలతో వచ్చిన వారిని గుర్తించిన తరువాత ఎన్ని చర్యలు తీసుకున్నా, వ్యాప్తిని అరికట్టడం అసాధ్యమేననే వాదన మరోపక్క బలంగా వినిపిస్తోంది. దానికంటే అసలు విదేశాలనుంచి వచ్చేవారిని కట్టడి చేయాల్సిందేననే వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య బృందాలు 

ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్‌ నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించారు. ఇక్కడకుప్రతిరోజూ అంతర్జాతీయ విమానాలు ఎన్ని వస్తున్నాయి? వాటిలో ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారనే వివరాలను సేకరించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఎయిర్‌పోర్టులో నియమించిన ప్రత్యేక వైద్యబృందాలను మళ్లీ అప్రమత్తం చేశారు. కొవిడ్‌ టెస్టుల్లో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినా, లేక లక్షణాలు కనిపించినా వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇతరత్రా మార్గాల్లో ఎవరైనా విదేశాల నుంచి జిల్లాకు వస్తే వారిని వెంటనే గుర్తించేందుకు ఆశా వర్కర్లు, వలంటీర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. 


ఫ ఇంటింటా ఫీవర్‌ సర్వే 

 కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు దాదాపు నియంత్రణలోకి వచ్చాయి. ఇక కరోనా తగ్గిపోయిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘ఒమైక్రాన్‌ వేరియంట్‌’ హెచ్చరికలతో మళ్లీ ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రతిఒక్కరూ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ స్వీయరక్షణ చర్యలు కొనసాగించేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తుండంతో జిల్లావ్యాప్తంగా ఇంటింటా ఫీవర్‌ సర్వేను కొనసాగించడంతోపాటు మరోవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 


ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ తీవ్రత గురించి ఇప్పుడే అంచనా వేయలేం. అది జిల్లాకు వ్యాపించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ఇతర కొవిడ్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రజలు కూడా అవగాహన పెంచుకుని మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఎవరికైనా జ్వరం, జలుబు, పొడిదగ్గు, ముక్కుదిబ్బడ, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలోనూ కొవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో కొందరు వ్యాక్సినేషన్‌పై శ్రద్ధ చూపడంలేదు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. 

- డాక్టర్‌ ఎం.సుహాసిని, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారిణి 

Advertisement
Advertisement