ఒమైక్రాన్‌ను తలపించే ఫ్లూ

ABN , First Publish Date - 2022-01-25T05:30:00+05:30 IST

జ్వరం, దగ్గు, జలుబులు కొవిడ్‌ లక్షణాలనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే అవే లక్షణాలతో మరో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ‘ఫ్లూ’ కూడా విస్తరిస్తోంది....

ఒమైక్రాన్‌ను తలపించే  ఫ్లూ

జ్వరం, దగ్గు, జలుబులు కొవిడ్‌ లక్షణాలనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే అవే లక్షణాలతో మరో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ‘ఫ్లూ’ కూడా విస్తరిస్తోంది. అయితే ఒమైక్రాన్‌, ఫ్లూ... ఈ రెండిటికీ తేడా కనిపెట్టేదెలా? ఎలాంటి చికిత్సను ఎంచుకోవాలి?  


మునుపటి కొవిడ్‌ వేరియెంట్ల లక్షణాల్లో జలుబు ఉండేది కాదు. కానీ ప్రస్తుత ఒమైక్రాన్‌ లక్షణాల్లో జలుబు, ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఫ్లూలో కూడా ఇవే లక్షణాలు ఉంటున్నాయి. కాబట్టి, సోకింది ఒమైక్రానా లేక ఫ్లూనా అనేది కచ్చితంగా ఎవరికి వారు కనిపెట్టే పరిస్థితి లేదు. అయితే ఒమైక్రాన్‌ మాదిరిగానే ఫ్లూను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఇన్‌ఫెక్షన్‌ను ఎంత త్వరగా కనిపెడితే, అంత తేలికగా తగ్గించుకోవచ్చు. లక్షణాల ఆధారంగా జ్వరం, దగ్గు, జలుబులకు తగిన మందులు వాడుకుంటే రోజుల వ్యవధిలోనే ఫ్లూ పూర్తిగా నయమైపోతుంది. అయితే ఫ్లూ సోకిన ప్రతి ఒక్కరికీ ఇదే రకమైన చికిత్స అనుసరించే పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా రిస్క్‌ గ్రూప్‌ కోవకు చెందిన వ్యక్తులు ఫ్లూ పట్ల రెట్టింపు అప్రమత్తంగా ఉండడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను అనుసరించాలి. 


ఆలస్యం చేయకూడదు

యాంటీబయాటిక్స్‌ మొదలుపెట్టి మూడు రోజులు దాటుతున్నా లక్షణాలు అదుపులోకి రాకపోయినా...

లక్షణాల తీవ్రత తగ్గకుండా పెరుగుతున్నా..

 మందులు వాడుతున్నా జ్వరం తగ్గకపోతున్నా....

 కఫం ఎక్కువగా వస్తున్నా...

 కఫం రంగు మారి, చిక్కబడినా...

రిస్క్‌ వీళ్లకే ఎక్కువ 

చిన్న పిల్లలు, 60 ఏళ్లు దాటిన పెద్దలు

 హృద్రోగాలు, మూత్రపిండాలు, కాలేయ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్లు

 మధుమేహులు

 అధిక రక్తపోటు కలిగి ఉండే వాళ్లు 

నిర్థారించుకోవడం అవసరం 

ఒమైక్రాన్‌, ఫ్లూ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఒమైక్రాన్‌ కాదని నిర్థారించుకోవడం కోసం ఆర్‌టిపిసిఆర్‌ పరీక్ష చేయించుకోవడం అవసరం. ఫలితం నెగటివ్‌ వచ్చినా, లక్షణాలు కొనసాగుతూ ఉంటే, తిరిగి మూడవ రోజు మరోసారి పరీక్ష చేయించుకోవాలి. రెండవసారి కూడా నెగటివ్‌ ఫలితం వస్తే, ఫ్లూగా భావించి లక్షణాల తీవ్రతను బట్టి చికిత్సను అనుసరించాలి. 


తేలికపాటి చికిత్స ఇలా... 

జ్వరానికి పారాసిటమాల్‌ తీసుకోవాలి. గొంతు నొప్పికి ఉప్పు నీటితో పుక్కిలించడం చేయాలి. ఆవిరి పట్టవచ్చు. దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, జలుబు పూర్తిగా తగ్గిపోయి, ఆక్సిజన్‌ మోతాదులు సమంగా ఉంటే, ఫ్లూ నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగా భావించాలి. ఒకవేళ ఈ మందులు తీసుకుంటూ, జాగ్రత్తలన్నీ పాటిస్తున్నప్పటికీ లక్షణాలు అదుపులోకి రాకపోతే వైద్యులను ఆశ్రయించి, వారు సూచించిన యాంటీబయాటిక్స్‌ మొదలుపెట్టాలి. 


ఇంటి పట్టున ఇలా...

 ఆవిరి పట్టవచ్చు.

చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.

 వేడిగా ఉండే సూప్‌లు తీసుకోవాలి.

 ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.

 ఉప్పు నీటితో నోరు 

      పుక్కిలించాలి.


ఫ్లూ తదనంతర సమస్యలు

ఫ్లూ నుంచి కోలుకున్నప్పటికీ కొందర్లో దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఫ్లూతో ఊపిరితిత్తులు బలహీనపడడం వల్ల తరచూ దగ్గు వేఽధించవచ్చు. కొంత దూరం నడకకే ఆయాసం అనిపించవచ్చు. ఇలాంటి వారికి చెస్ట్‌ ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. గాలి పీల్చి, వదిలేటప్పుడు శబ్దాలు వస్తుంటే, ఇన్‌హెలర్స్‌ వాడవలసి ఉంటుంది. ఆస్తమా ఉన్నవారికి దీర్ఘకాల చికిత్స అవసరం ఉంటుంది. 


ఫ్లూ నుంచి రక్షణ ఇలా...

కొవిడ్‌ నిబంధనలే ఫ్లూకు కూడా వర్తిస్తాయి. మాస్క్‌ఽ ధారణతో ఫ్లూకు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందే వీలుండే ఇరుకైన, గాలి చొరబడని, చీకటి ప్రదేశాల్లో నివసించకూడదు. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. 


ఇమ్యూనిటీ పెంచే ఆహారం

పుల్లని పళ్లైన కమలా, బత్తాయి, పైనాపిల్‌ తీసుకోవాలి. తాజా ఆకుకూరలు ఎక్కువగా తినాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఎంచుకోవాలి. ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తూ, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. 


ఒమైక్రాన్‌ కాలంలో ఉన్నాం కాబట్టి ఫ్లూ సోకినప్పటికీ, ఒమైక్రాన్‌గానే అనుమానించాలి. ఏ ఒక్క లక్షణం కనిపించినా, వెంటనే ఎవరికి వారు తమను తాము ఐసొలేట్‌ చేసుకోవాలి. ఆర్‌టిపిసిఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. నెగటివ్‌ ఫలితం వచ్చినా, సింప్టమాటిక్‌ ట్రీట్మెంట్‌ తీసుకుంటూ లక్షణాలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ అందరికీ దూరంగా ఉండాలి. తిరిగి మూడవ రోజు రెండోసారి ఆర్‌టిపిసిఆర్‌ పరీక్ష చేయించుకోవాలి.


సెకండరీ ఇన్‌ఫెక్షన్లు

చికిత్స సక్రమంగా తీసుకోకపోయినా, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాలు, ఇతరత్రా తీవ్ర వ్యాధులు ఉన్న వాళ్లకు ఫ్లూ తగ్గిన తర్వాత సెకండరీ ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. కాబట్టి వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండే కోవకు చెందిన వారు ఫ్లూ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, జాగ్రత్తగా మసలుకుంటూ ఉండాలి. ఒకవేళ తిరిగి ఫ్లూను పోలిన లక్షణాలు మొదలైతే ఆలస్యం చేయకుండా వైద్యులను ఆశ్రయించాలి. 


సొంత వైద్యంతో చేటు తప్పదు

ఏ ఇన్‌ఫెక్షన్‌ సోకినా మెడికల్‌ షాపుకు వెళ్లి యాంటీబయాటిక్స్‌ కొని వాడేయడం, వాటితో లక్షణాలు తగ్గకపోతే వేరొక రకం యాంటీబయాటిక్స్‌ వాడడం ఎక్కువ మంది చేసే పని. కానీ ఇలా సొంత వైద్యాన్ని అనుసరించడం వల్ల చికిత్స నిర్థారణ క్లిష్టమవుతుంది. మరీ ముఖ్యంగా ఫ్లూలో యాంటీబయాటిక్స్‌ పాత్ర చాలా తక్కువ. లక్షణాలను అదుపుచేసే చికిత్సతోనే ఫ్లూను పూర్తిగా తగ్గించుకోవచ్చు. అయితే ఇన్‌ఫెక్షన్‌ తగ్గకుండా పెరుగుతున్నప్పుడు, కఫాన్ని కల్చర్‌ చేసి, ఫలితం ఆధారంగా యాంటీబయాటిక్స్‌ను వైద్యులు ఎంచుకుంటారు. అలా కాకుండా సొంతంగా యాంటీబయాటిక్స్‌ వాడి, అప్పటికీ తగ్గక అంతిమంగా వైద్యులను కలిస్తే, కఫ పరీక్ష క్లిష్టమవుతుంది. మరీ ముఖ్యంగా ఫ్లూ నుంచి పూర్తిగా కోలుకున్న రిస్క్‌ కోవకు చెందిన వారిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువ. ఆ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ను కచ్చితంగా నిర్థారించాలంటే యాంటీబయాటిక్స్‌ వాడి ఉండకూడదు. సొంత వైద్యంలో భాగంగా యాంటీబయాటిక్స్‌ వాడడం వల్ల యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ చేకూరే సమస్య ఉంటుంది. ఏ యాంటీబయాటిక్స్‌కూ ఇన్‌ఫెక్షన్‌ అదుపులోకి రాని చిక్కు సమస్య మొదలయ్యే స్థితి ప్రమాదకరం.


డా. సౌమ్య బొందలపాటి

ఇంటర్నల్‌ మెడిసిన్‌

కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌

హైదరాబాద్‌.

Updated Date - 2022-01-25T05:30:00+05:30 IST