తస్మాత్‌ జాగ్రత్త.. ‘ఒమైక్రాన్‌’తో ముప్పే .. !

ABN , First Publish Date - 2021-11-30T14:00:22+05:30 IST

కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’తో ముప్పేనని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ హెచ్చరించారు. దక్షిణాఫ్రికాలో ఇటీవలే గుర్తించిన ఈ కొత్త వైరస్‌ అన్ని దేశాలకు వ్యాపిస్తోందని ఆయన

తస్మాత్‌ జాగ్రత్త.. ‘ఒమైక్రాన్‌’తో ముప్పే .. !

- ఆరోగ్యశాఖ కార్యదర్శి హెచ్చరిక 

- జిల్లా కలెక్టర్లతో హుటాహుటిన సీఎస్‌ భేటీ


చెన్నై: కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’తో ముప్పేనని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ హెచ్చరించారు. దక్షిణాఫ్రికాలో ఇటీవలే గుర్తించిన ఈ కొత్త వైరస్‌ అన్ని దేశాలకు వ్యాపిస్తోందని ఆయన తెలిపారు. కొత్త వైరస్‌ బారిన పడకుండా వుండాలంటే రెండు డోసుల టీకా వేసుకోవడం, మాస్కులు ధరించటమే తరుణోపాయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందనే భావంతో నలభైశాతం ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించడం మానుకున్నారన్నారు. ‘ఒమైక్రాన్‌’ వైరస్‌ బారిన పడ కుండా ఉండాలంటే మాస్కులు తప్పకుండా ధరించాల్సిందేనని ఆయన నొక్కిచెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్త వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ‘ఒమైక్రాన్‌’ వైరస్‌ వల్ల ఇప్పటివరకూ పాటించిన కరోనా నిరోధక కఠిన నిబంధనలు మళ్ళీ పాటించాల్సిన అవసరం ఏర్పడుతుందేమోనని తాము భావిస్తున్నామని చెప్పారు. కొత్త వైరస్‌ నిరోధక చర్యలలో భాగంగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించ నున్నామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, మారిషష్‌, సింగపూర్‌, ఇజ్రాయిల్‌ తదితర 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో అడుగుపెట్టిన వెంటనే వారికి కరోనా వైద్యపరీక్షలు చేస్తా మన్నారు. ఒమైక్రాన్‌ పరీక్షలు నిర్వహించేందుకు నగరంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్‌లను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంతో కలిసి సోమవారం పరిశీలించిన అనంతరం రాధాకృష్ణన్‌ ప్రజలను మీడియాతో మాట్లాడారు. 


 కలెక్టర్లతో సీఎస్‌ చర్చలు

రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సోమవారం సచివాలయం నుంచి జరిగిన ఈ సమావేశంలో ఆయనతో పాటు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ నగరపాలక, రెవెన్యూ, పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్షరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ మాట్లాడుతూ... కొత్త వైరస్‌ వ్యాప్తి నిరోధానికి యుద్ధప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ‘ఒమైక్రాన్‌’ వైరస్‌ తీరు తెన్నులపై పవర్‌పాయింట్‌ ప్రదర్శన ద్వారా ఆయన కలెక్టర్లకు వివరించారు. ప్రస్తుతం రెండు విడతల కరోనా నిరోధక టీకాలు వేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకున్న చర్యలను మళ్ళీ చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-11-30T14:00:22+05:30 IST