‘ఒమైక్రాన్‌’ ఎఫెక్ట్‌.. మెగావ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2021-12-05T14:09:54+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన 13వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు మునుపెన్నడూ లేనంత స్పందన లభించింది. దేశంలో అక్కడక్కడా కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ కేసులు

‘ఒమైక్రాన్‌’ ఎఫెక్ట్‌.. మెగావ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు పోటెత్తిన జనం

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన 13వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు మునుపెన్నడూ లేనంత స్పందన లభించింది. దేశంలో అక్కడక్కడా కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ కేసులు బయటపడుతున్నాయని వార్తలు వెలువడటంతో ఇప్పటి వరకూ టీకాలు వేసుకోని వారంతా టీకాల శిబిరాల వద్ద బారులు తీరారు. అదే సమయంలో మొదటి డోసు వేసుకుని గడువు లోపల రెండో డోసు టీకాలు వేసుకోనివారు కూడా ఈ శిబిరాల వద్దకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎప్పటివలెనే రాష్ట్రంలో 50 వేలకు పైగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేశారు. చెన్నైలో వార్డుకు ఎనిమిది శిబిరాలు చొప్పున మొత్తం 1600 టీకా శిబిరాలు ఏర్పాటయ్యాయి. నగరంలోని బస్‌స్టాపులు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద ఏర్పాటైన శిబిరాల ఎదుట మునుపెన్నడూ లేనంతంగా వందల సంఖ్యల టీకాలు వేసుకునేందుకు నగరవాసులు బారులు తీరారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జే రాధాకృష్ణన్‌ తేనాంపేట ఎస్‌ఐఈటీ కళాశాలలో ఏర్పాటైన వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఇదే విధంగా రాయపేట, మైలాపూరు, అడయార్‌, కోయంబేడు, రాయపురం, ట్రిప్లికేన్‌, చేపాక్‌, వాషర్‌మెన్‌పేట, కోడంబాక్కం, వడపళని తదితర ప్రాంతాల్లో ఏర్పాటైన శిబిరాలలో నగరవాసులు టీకాలు వేసుకున్నారు. 13 వ విడత మెగావ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో శనివారం సాయంత్రానికి సుమారు పదిలక్షల మందికి పైగా టీకాలు వేసుకున్నట్టు అధికారులు తెలిపారు.


ఆ ముగ్గురికి సోకింది ఏ రకం వైరస్‌?

తిరుచ్చి చెన్నై విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి సోకిన వైరస్‌ ఏ రకానికి చెందినవో కనుగొనేందుకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ తాకిడికి గురైన విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల వద్ద కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజులకు ముందు చెన్నై, తిరుచ్చి విమానాశ్రయాల్లో కొత్త వైరస్‌ వ్యాప్తి చెందిన విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వైద్యపరీక్షలు జరిపినప్పుడు ముగ్గురికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. చెన్నై విమానాశ్రయంలో తొమ్మిదేళ్ల చిన్నారికి, 30 యేళ్ళ మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యంది. తిరుచ్చి విమానాశ్రయంలో 56యేళ్ల వ్యక్తికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఈ ముగ్గురికి ఏ రకం కరోనా వైరస్‌ సోకిందని నిర్ధారించుకునేందుకుగాను వారి రక్తపు నమూనాలను చెన్నై డీఎంఎస్‌ ప్రాంగణంలోని ప్రయోగశాలకు పంపారు. ఈ పరీక్ష ఫలితాలు ఈ నెల ఏడో తేదీ వెలువడ తాయని, అప్పుడే ఏ రకం కరోనా వైరస్‌ సోకిందనే విషయం బహిర్గతమవుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-05T14:09:54+05:30 IST