Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 16 May 2022 00:53:32 IST

ఖయ్యామ్‌ కవితలో అద్వైత వెలుగులు

twitter-iconwatsapp-iconfb-icon

‘‘నేను హంసను లోతైన చోటు నుండి ఎగిరి వచ్చాను; దూసుకుంటూ ఎత్తులకు చేరాలని మనసుపడ్డాను; నా మర్మాల్ని రక్షించె తోడు లేక కుమిలి పోయాను - కనుక వాకిలిలో దూరి నే బయటకు దూకుతున్నాను’’. (ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయి, అనువాదం రోచిష్మాన్‌) "Poetry is abstract'' అని ఆదిభట్ల నారాయణ దాసు తెలియజెప్పారు. ఈ మాటలు చెప్పడానికి కారణం ఉమర్‌ ఖయ్యామ్‌ కవిత్వమే అయుంటుంది. 


ఉమర్‌ ఖయ్యామ్‌ 18-5-1048లో పర్షియా (ఇరాన్‌) ఖొర స్తాన్‌ ప్రాంతంలోని నైషాపూర్‌లో పుట్టాడు. 1131లో మరణిం చాడు. ఒక రుబాయీలో తన వయస్సు 77యేళ్లని చెప్పుకు న్నాడు. ఉమర్‌ ఖయ్యామ్‌ అన్నది కలం పేరు (తఖల్లుస్‌). అసలు పేరు గియాత్‌ ఉద్‌ దీన్‌ అబుల్‌ ఫతహ్‌ ఉమర్‌ బిన్‌ ఇబ్రాహిమ్‌ అల్‌ ఖయ్యామ్‌. ఖయ్యామ్‌ అంటే గూడారాలు వేసే వ్యక్తి అని అర్థం. గూడారాలు వెయ్యడం వీళ్ల వంశవృత్తి. అది వంశనామం అయింది. ఖయ్యామ్‌ వంశస్థులు ఫారశీకులు. బహుశా ఖయ్యామ్‌ తాత లేదా తండ్రి ఇస్లాంలోకి మారి ఉండచ్చు. ఖయ్యామ్‌ అవివాహితుడు. ఈజిప్ట్‌, అరేబియా, ఆఫ్ఘనిస్తాన్‌, పంజాబ్‌ ప్రాంతాల్లో సంచారజీవనం చేశాడు. ఖయ్యామ్‌ గణిత, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్కుడు. తత్త్వవేత్త. ‘తఖ్వీమెజలాలీ’ అనే జ్యోతిష గ్రంథం రాశాడు ఖయ్యామ్‌. ‘అరాయిసన్‌ నఫాయిస్‌’ అనే తత్త్వశాస్త్ర గ్రంథం, ‘అల్‌ జబర్‌’ అనే ఎరబి (అట్చఛజీఛి) గ్రంథం, ‘ఒఖిలీదస్‌’ (ఎ్ఛౌ ఝ్ఛ్టటడ), ‘ఇల్మె తబీయాత్‌’ (ఇజ్ఛిఝజీట్టటడ), ‘దర్బారయే హుక్మతుల్‌ ఖాలిఖ్‌’ అనే వేదాంత శాస్త్ర గ్రంథం, ‘రిసాలా’ ఆర్థికశాస్త్ర గ్రంథం, ‘రిసాలయెమౌనూమా’ ఆనే తర్కశాస్త్ర గ్రంథం ఖయ్యామ్‌ రచనలు.


ఉమర్‌ ఖయ్యామ్‌ అనగానే ప్రపంచానికి గుర్తు వచ్చేవి రుబాయీలే. తాత్త్వికత, మార్మికత, కవిత్వం మూడిటినీ రంగరించి రుబాయియాత్‌గా ఖయ్యామ్‌ లోకానికి అందించాడు. ఖయ్యామ్‌ రుబాయీలు 2000వరకూ దొరికాయి. అందులో కొన్ని ప్రక్షిప్తాలు. వేమన పద్యాలలో లాగా ఖయ్యామ్‌ రుబా యీలలోకూడా ప్రక్షిప్తాలున్నాయి. స్వామి గోవిందతీర్థ 1096 రుబాయీలు మాత్రమే ఉమర్‌ ఖయ్యామ్‌ వని నిర్ణయించి వాటికి ఇంగ్లీష్‌, మరాఠీ అనువాదాలు చేశారు. ఇంగ్లీష్‌ అనువాదం పేరు ‘ఖీజ్ఛి ్ఛూఛ్టిౌట ౖజ ఎట్చఛ్ఛి’. 1859లో ఉఛీఠ్చీటఛీ ఊజ్ట్డీఎ్ఛట్చజూఛీ  తొలివిడతగా 75 రుబాయీలను ఇంగ్లిష్‌ లోకి అనువదించి విడుదల చేశారు. ఇది చాలా ఆలస్యంగా ఇంగ్లిష్‌ లోకంలో ఆదరణను పొందింది. రెండవ విడతగా 1868లో 110 రుబాయీలను ప్రకటించారు ఫిట్జ్‌ జెరాల్డ్‌. అటుపైన ఖయ్యామ్‌ రుబాయీలు విశ్వవ్యాప్త మయ్యాయి. ఫిట్జ్‌జెరాల్డ్‌ అనువాదాలు స్వేచ్ఛానువాదాలు. ఆయన అనువాదంలో కనిపిస్తున్న తొలి రుబాయీని ఆయనే మరొక విధంగా కూడా అనువదించారు. ఏ రుబాయీకి ఆ రుబాయీగా సరిగ్గా అనువదించినది స్వామి గోవింద తీర్థ. మనకు ఉమర్‌ఖయ్యామ్‌ తెలియాలంటే గోవింద తీర్థ అనువాదాన్నే చదవాలి.


ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలను తెలుగులో ఫార్సీ నుంచి ఏ రుబాయీకీ ఆ రుబాయీగా, పిఠాపురం ఉమర్‌ ఆలీషాహ్‌ అనువదించారు. ఈ అనువాదాలు 1926 నుండీ భారతి పత్రికలో ధారావాహికగా అచ్చయ్యాయి. ఇవి తెలుగులో వచ్చిన ఉన్నతమైన ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీల అనువా దాలు. తెలుగులో ఉమర్‌ ఖయ్యామ్‌ను సరిగ్గా అర్థం చేసు కోవాలంటే ఉమర్‌ అలీ షాహ్‌ అనువాదాల్నే చదవాలి. బూర్గుల రామకృష్ణారావు స్వల్ప సంఖ్యలో ఫార్సీ నుండి ఖయ్యామ్‌ రుబాయీలను తెలుగులోకి తెచ్చారు. దువ్వూరి రామిరెడ్డి పానశాల పేరుతో ఈ రుబాయీలను అనువదిం చారు. ఇక ఇతర అనువాదాలు ఫిట్జ్‌జెరాల్డ్‌ ఇంగ్లిష్‌ నుండి తెలుగుకు వచ్చినవే. అవి 25కు పైచిలుకు ఉన్నాయి. ఆదిభట్ల నారాయణదాసు ఫిట్జ్‌జెరాల్డ్‌ ఇంగ్లిష్‌ అనువాదాల్ని సంస్కృతంలోకీ, అచ్చతెలుగు (దేశ్యాంధ్రం)లోకీ అనువదించారు.


ఉమర్‌ ఆలీషాహ్‌ అనువదించిన ఒక ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీ : ‘‘నీవు జనింపక పూర్వం బీ వసుధన్‌ స్త్రీలూఁ, బురుషు లెందఱో కల రా జీవమె నీలో నున్నది యీవును నశియింతు వెపుడో యిఁక రా వేఁగన్‌’’. ఉమర్‌ అలీషాహ్‌ అనువదించిన ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీల్లోంచి మచ్చుకు కొన్ని పలుకులు: ‘‘వనముల నెఱ్ఱ పువ్వులు నృపాల రణాంగణ వీర రక్త సంజనితములె శోభిత దశన్‌’’, ‘‘యే పనికో కాలము చుట్టుచున్నది సర్పంబట్లు జాగ్రత్త’’, ‘‘ప్రపంచమనగ సంధ్యలు, నుషస్సులనెడు నశ్వ ముల నెలవు’’, ‘‘మదియే హితమై సుఖమిచ్చు నీకు దుఃఖమే విషము’’, ‘‘తెలివి గలదేని తెలివినే తెలిసికొనుము’’, ‘‘కాల మేరి నయినన్‌ మన్నించెనే?’’, ‘‘నీ మొగ ముండదు పోవు బూడిదై’’, ‘‘ముండ్ల పొదలనె గద గులాబులు జనించు’’, ‘‘ఓ విధీ యెంతకాల మిటు లూరక వేదనలందు డింతు వయ్యో విరమింపవేమి?’’, ‘‘అశ్రువులే నాకు మిత్రులు’’.


‘‘అతడు, శూన్యమైనా అతడున్నాడు, నాకు తెలిసింది; ఈ సత్యాన్ని ప్రపంచం అన్న పుస్తకం తెలిపింది; హృదయం అతడి కాంతితో గ్రహించగలిగినప్పుడు - నాస్తికత్వపు చీకటి దాన్ని నమ్మకపు వెలుగుగా మార్చింది’’. (అనువాదం రోచిష్మాన్‌) అని అన్న ఖయ్యామ్‌ భారతీయ వేదాంత చింతనతో ప్రభావితమైనట్లు తెలుస్తోంది.  


‘‘ఆ పిపీలికా బ్రహ్మ పర్యంతమైన శక్తి నీ తేజమునను బ్రజ్వలన మొందు నీశ్వరునకు నీకును భేదమేమి లేదు నిన్నుఁజెందని సద్గుణ మున్న దెందు?’’ (ఉమర్‌ అలీ షాహ్‌ అనువాదం) అని అద్వైత భావనల్ని రుబాయీలుగా అందించారు. వేదాంత చింతన తనలో పండాక ‘‘...మాకు నిషిద్ధజీవనము మౌంజియు జన్నిదమున్న మేలగున్‌’’ (ఉమర్‌ అలీషాహ్‌ అనువాదం) అని ఖయ్యామ్‌ అన్నాడు. 


‘‘నీవు నా మధు కలశంబు నేలఁ బగులఁగొట్టి, మధువంతయును నేలఁ బెట్టినావు నా మనో వ్రణమును రేపినావు నే నిఁ కీశ్వరునిఁ గూర్చి మొరనిడ నేఁగుచుంటి’’ (ఉమర్‌ అలీషాహ్‌ అనువాదం) అని అన్న ఒక్క రుబాయీ చాలు ఉమర్‌ ఖయ్యామ్‌ కవిత్వ తాత్త్విక, తాత్త్విక కవిత్వ ఔన్న త్యాన్ని తెలుసుకోవడానికి.


ఉమర్‌ ఖయ్యామ్‌ ఒక మతాతీతమైన వ్యక్తి. కాబా యాత్రను, రంజాన్‌ను ఆమోదించలేదు. ‘‘నే మసీదుముత వల్లిని గాను...’’ అని (ఉమర్‌ అలీ షాహ్‌ అనువాదం) ఉమర్‌ ఖయ్యామ్‌ అన్నాడు. ఇలాంటి వాటివల్లే ఔరంగ్‌ జేబ్‌ ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలను నిషేధించి ఉంటాడు. తాను సరి అనుకున్నాక, తానొక ముస్లీమైనందుకు కించప డుతున్నానని సాహసంతో ఇలా చెప్పాడు ఉమర్‌ ఖయ్యామ్‌: ‘‘ఎంతకాల మజ్ఞానినై యెసఁగుచుందు?/ మతివిరక్తిని పడి, ముసల్మాను మతము/ విడిచి, జందెమ్ము వేయుదు ద్విజునిభంగి:/ నేలయన ‘‘మోమి’’ ననఁగ లజ్జించుచుంటి’’ (ఉమర్‌ అలీ షాహ్‌ అనువాదం). కవిత్వం పేరుతో ప్రాంతీ యత, మత, కుల వాదాల అకవిత్వం తెలుగుకు పెను శాపం అయిపోయిన ప్రస్తుత పరిస్థితిలో ఉమర్‌ ఖయ్యామ్‌ స్ఫూర్తితో తెలుగులో ‘కవిత్వం’ రావాల్సిన అవసరం ఉంది. 


మహాకవులకు లోకాన్ని పిలిచే గొప్ప లక్షణం ఉంటుంది. ఇదిగో ఇలా (రోచిష్మాన్‌ అనువాదం): ‘‘ఈ వయస్సు శకటం విచిత్రంగా గడిచిపోతున్నది; మధువును ఇవ్వు ఖుషీ అనూహ్యంగా గడిచిపోతున్నది; సాఁకీ, నా శత్రువు కోసం నువ్వు ఆలోచించద్దు - తీసుకురా పాత్ర నిశ వేగంగా గడిచిపోతున్నది’’.


రోచిష్మాన్‌

94440 12279

(మే 18 ఉమర్‌ ఖయ్యామ్‌ జయంతి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.