ఒమన్‌లో 4రోజుల లాక్‌డౌన్.. రెండు దేశాలపై బ్యాన్ ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-18T14:30:02+05:30 IST

ఈద్ అల్ అధా పండుగ సెలవుల నేపథ్యంలో ఒమన్ సుప్రీం కమిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఒమన్‌లో 4రోజుల లాక్‌డౌన్.. రెండు దేశాలపై బ్యాన్ ఎత్తివేత

మస్కట్: ఈద్ అల్ అధా పండుగ నేపథ్యంలో ఒమన్ సుప్రీం కమిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ప్రజలు భారీగా బయటకు వచ్చే అవకాశం ఉండడంతో మహమ్మారి మరింత ప్రబలుతుందని భావించిన కమిటీ దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ విధించింది. జూలై 20 నుంచి 24 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. ఈ నాలుగు రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార సముదాయాలను కూడా మూసి ఉంచాలని ఆదేశించింది. ప్రజలు కూడా అనవసరంగా బయటకు రావొద్దని పేర్కొంది. తమ ఆదేశాలను బేఖాతరు చేసి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


అలాగే సుప్రీంకమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్, బ్రూనై దేశాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఒమన్‌ చేరుకున్న తర్వాత తప్పనిసరిగా 7రోజుల పాటు ఇన్సిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. క్వారంటైన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికేట్ చూపించాలని తెలిపింది. కాగా, వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే హెల్త్‌కేర్ సిబ్బందికి ఈ క్వారంటైన్ నుంచి ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మినహాయింపు ఇచ్చింది.   

Updated Date - 2021-07-18T14:30:02+05:30 IST