Abn logo
Oct 19 2020 @ 01:10AM

ఓం శ్రీ ఆదిశక్తి స్వరూపిణేనమః

Kaakateeya

పూర్వం రంభుడు అనే రాజు పంచాగ్నుల నడుమ తపస్సు చేసి అగ్ని దేవుణ్ని మెప్పించి ముల్లోకాలనూ జయించే పుత్రుణ్ని వరంగా కోరాడు. సరేనని అనుగ్రహించిన అగ్నిదేవుడు.. ‘ఏ రూపాన్ని చూసి నీ మనస్సు చలిస్తుందో, ఆమె గర్భాన నీవు కోరుకున్న వీరుడు జన్మిస్తాడు’ అన్నాడు. తర్వాత కొంతకాలానికి.. నల్లగా నిగనిగలాడే ఒక మహిషాన్ని చూసి రంభుడు మోహానికి గురయ్యాడు. అగ్ని వరం మేరకు ఆ మహిషి గర్భాన మహిషుడు ఉద్భవించాడు. అతడే మహిషాసురుడు.


అతడు సుదీర్ఘకాలంపాటు బ్రహ్మ గురించి తపస్సు చేసి.. పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో ఇంద్రుడిపైనే యుద్ధం ప్రకటించాడు. దేవతలను తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించాడు. అప్పుడు దేవతలందరి శక్తి అంశలే అవయవాలుగా ఒక తేజోమహారాశి.. అష్టాదశ భుజాలతో పరాశక్తియైు ఆవిర్భవించింది. శివుడుతన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, వైజయంతిమాలను, అగ్ని శక్తిని, వాయువు ధనుస్సును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు దండాన్ని, బ్రహ్మ కమండలాన్ని, విశ్వకర్మ చూడామణిని కానుకలుగా ఆ తల్లికి కానుకగా సమర్పించారు.


ఆ లోకేశ్వరి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసుర మర్దనకు సిద్ధమైంది. మొదట మహిషుని సైన్యప్రముఖులైన విరూపాక్షుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు, ఆసిలోముడు, ధూమ్రాక్షుడు తదితరులను సంహరించింది. ఆపై, తొమ్మిది రోజులపాటు మహిషుడితో యుద్ధం చేసిన ఆ మహేశ్వరి పదో రోజున ఆ లోక కంటకుణ్ని వధించింది. అసుర శక్తిపై దైవ శక్తి సాధించిన విజయానికి గుర్తుగా నాటి నుంచి శరన్నవరాత్రుల్లో ఆ ఆదిపరాశక్తిని దుర్గ రూపంలో ఆరాధిస్తూ.. పండుగలా జరుపుకొంటున్నారు.


మహిషాసురుడు మనలోని మూర్ఖత్వానికి, తామస ప్రవృత్తికి గుర్తు. ఇంద్రాది దేవతలపై విజయం అంటే.. మన ఇంద్రియాలపై తామస గుణం పైచేయి సాధించడం. శరన్నవరాత్రుల్లో దేవీ ఆరాధానతో.. మనలో జ్యోతిస్వరూపంగా దాగి ఉన్న ఆదిపరాశక్తి ఆ తమోగుణాన్ని నాశనం చేసి మనను కాపాడుతుందని ఈ కథ అంతరార్థం. అందుకే.. శరన్నవరాత్రుల్లో భక్తులు తమ అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను) అంతం చేసుకోవడానికి ఆ తల్లిని శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. సిరిసంపదల కోసం లక్ష్మిగా.. జ్ఞానసముపార్జన తలంపుతో సరస్వతీ మాతగా ఆరాధిస్తారు. విజయదశమి నాడు ముఖ్యమైనది.. శమీపూజ. ఆరోజు భక్తులు శమీవృక్షం (జమ్మిచెట్టు) చుట్టూ ప్రదక్షిణం చేస్తూ..శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ


అనే శ్లోకాన్ని చదువుతారు. విజయదశమినాడు ఏ కార్యం ప్రారంభించినా తప్పకుండా సత్ఫలితం కలుగుతుంది. శ్రీరామచంద్రుడు అదే రోజు దశకంఠుని దునుమాడాడు. ఆ శుభసమయాననే దేవదానవులు పాలసముద్రం నుంచి అమృతం పొందగలిగారు. పాండవులు అజ్ఞాతవాసం ఆరంభించే ముందు ఆ ఆదిపరాశక్తిని పూజించి, శమీవృక్షానికి భక్తితో మొక్కి, తమ ఆయుధాలను దానిపై దాచి విరటుని కొలువులోకి ప్రవేశించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసాన్ని ముగించగలిగారు. 

- విద్వాన్‌ వల్లూరుచిన్నయ్య


Advertisement