ఓం ప్రకాశ్‌ చౌతాలా దోషి

ABN , First Publish Date - 2022-05-22T07:30:16+05:30 IST

హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా మరో కేసులో శిక్ష అనుభవించనున్నారు.

ఓం ప్రకాశ్‌ చౌతాలా దోషి

అక్రమ ఆస్తుల కేసులోనిర్ధారించిన ప్రత్యేక కోర్టు

6 కోట్లు అధికంగా కలిగి ఉన్నారని సీబీఐ ఆరోపణ

శిక్షపై 26న వాదనలు


న్యూఢిల్లీ, మే 21: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా మరో కేసులో శిక్ష అనుభవించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో ఆయన దోషి అని శనివారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ నేరానికి ఎంత శిక్ష విఽధించాలనే విషయమై ఈ నెల 26న వాదనలు విననున్నట్టు ప్రత్యేక జడ్జి వికాస్‌ ధుల్‌ ప్రకటించారు. ఈ సమయంలో చౌతాలా కూడా కోర్టులోనే ఉన్నారు. చౌతాలా 1995 నుంచి 2005 వరకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 


చట్టబద్ధమైన ఆదాయ వనరుల కన్నా అధికంగా ఆస్తులు కలిగి ఉన్నారంటూ 17ఏళ్ల క్రితం 2005లో సీబీఐ కేసు నమోదు చేసింది. 1993-2006 మధ్య ఆయన అదనంగా రూ.6.09 కోట్లు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ 2010లో అభియోగపత్రం దాఖలు చేసింది. హరియాణాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు షంషేర్‌ సింగ్‌ సుర్జేవాలా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇది ఆయనకు విధించనున్న రెండో శిక్ష కానుంది. ఉపాధ్యాయ భర్తీ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన పదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. శిక్ష పూర్తవడంతో గత ఏడాది జూలై రెండున తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందే జనవరిలో ఢిల్లీలోని ఓ కోర్టులో ఆయనపై అక్రమాస్తుల విషయంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదల కాగానే ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ తన పార్టీ ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. జైలులోనే పది, పన్నెండు తరగతులు చదివి ఉత్తీర్ణులయ్యారు. ఓం ప్రకాశ్‌ చౌతాలా కుమారులపైనా అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి. 

Updated Date - 2022-05-22T07:30:16+05:30 IST