పార్లమెంట్ క్యాంటీన్‌ ఫుడ్‌పై సబ్సిడీ రద్దు : ఓం బిర్లా

ABN , First Publish Date - 2021-01-19T23:34:46+05:30 IST

పార్లమెంటు క్యాంటీన్లలో ఆహార పదార్థాలు గతం కన్నా ఖరీదు కాబోతున్నాయి

పార్లమెంట్ క్యాంటీన్‌ ఫుడ్‌పై సబ్సిడీ రద్దు : ఓం బిర్లా

న్యూఢిల్లీ : పార్లమెంటు క్యాంటీన్లలో ఆహార పదార్థాలు గతం కన్నా ఖరీదు కాబోతున్నాయి. పార్లమెంటు సభ్యులకు, ఇతరులకు ఆహార పదార్థాలపై ఇచ్చే రాయితీని రద్దు చేశారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ రాయితీని రద్దు చేయడం వల్ల లోక్‌‌సభ సచివాలయానికి సంవత్సరానికి రూ.8 కోట్ల వరకు ఆదా అవుతుందని తెలుస్తోంది. 


లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు. పార్లమెంటులోని క్యాంటీన్లను నార్తర్న్ రైల్వేస్ కాకుండా ఐటీడీసీ నిర్వహిస్తుందని చెప్పారు. ఈ క్యాంటీన్లలో సరఫరా చేసే ఆహార పదార్థాలపై ఇస్తున్న రాయితీని రద్దు చేసినట్లు తెలిపారు. అయితే దీనివల్ల ఆదా అయ్యే సొమ్ము గురించి ఆయన వివరించలేదు. 


బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటు సభ్యులందరినీ కోరుతామని ఓం బిర్లా చెప్పారు. రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయన్నారు. లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. క్వశ్చన్ అవర్ యథావిధిగా ఉంటుందన్నారు. ఎంపీల నివాసాల వద్ద ఆర్‌టీపీసీఆర్ కోవిడ్-19 టెస్ట్‌ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జనవరి 27 నుంచి 28 వరకు ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎంపీల కుటుంబ సభ్యులకు, సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయన్నారు. 


Updated Date - 2021-01-19T23:34:46+05:30 IST