పరిష్కారమెలా?

ABN , First Publish Date - 2020-03-19T09:58:08+05:30 IST

విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో ఆటగాళ్లంతా భయపడుతున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి సందేహిస్తున్నారు. దాంతో.. విశ్వక్రీడల నిర్వహణకు

పరిష్కారమెలా?

ఒలింపిక్స్‌ నిర్వహణపై ఐఓసీ మల్లగుల్లాలు

గగ్గోలు పెడుతున్న అథ్లెట్లు


లాసన్నె: విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో ఆటగాళ్లంతా భయపడుతున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి సందేహిస్తున్నారు. దాంతో.. విశ్వక్రీడల నిర్వహణకు సంబంధించి సరైన పరిష్కారం లభించడం లేదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వాపోయింది ‘ఇదో అసాధారణమైన పరిస్థితి. దీనిని అధిగమించడానికి అంతే అసాధారణమైన పరిష్కారమేదో కావాలి’ అని ఐఓసీ అధికార ప్రతినిధి బుధవారం పేర్కొన్నారు. మరోవైపు ఒలింపిక్స్‌ను జరుపుతామని ఐఓసీ పదేపదే ప్రకటించడం ద్వారా తమ ప్రాణాలతో చెలగాటమాడుతోందని ప్రపంచ మేటి అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఒలింపిక్స్‌ యధాప్రకారం నిర్వహిస్తామని ఐఓసీ చెబుతోంది. దాంతో మేం రోజూ సాధన చేయాల్సి వస్తోంది. అంటే.. ఐఓసీ మా ప్రాణాలు, మా కుటుంబ సభ్యుల ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలనూ రిస్క్‌లో పడేయాలనుకుంటోంది’ అని గ్రీస్‌కు చెందిన పోలోవాల్ట్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ కాటరీనా స్టెఫాండి దుయ్యబట్టింది. విశ్వక్రీడలను నిర్వహించాలని భావిస్తున్న ఐఓసీ..సాఽధ్యమైనంత చక్కగా ప్రాక్టీస్‌ చేయాలని అథ్లెట్లకు సూచించడంపై బ్రిటన్‌కు చెందిన ప్రపంచ హెప్టాథ్లాన్‌ చాంపియన్‌ జాన్సన్‌ థాంప్పన్‌ మండిపడింది. ‘ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ కఠినమైన ఆరోగ్య చర్యలు చేపట్టాయి. అలాంటి తరుణంలో ప్రాక్టీస్‌ ఎలా సాధ్యం. ఐఓసీ తన ప్రకటనతో క్రీడాకారులను ఒత్తిడికి గురిచేస్తోంది’ అని ఆమె చెప్పింది. ఇక.. జపాన్‌ ఒలింపిక్‌ కమిటీ డిప్యూటీ చీఫ్‌ కొజో టషిమాకు ‘కొవిడ్‌-19’ పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని కొజోనే స్వయంగా వెల్లడించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా..ఒలింపిక్స్‌ నిర్వహణపై ఇప్పటికిప్పుడు తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని ఐఓసీ అనడం గమనార్హం. ఒలింపిక్స్‌ నిర్వహణ కంటే కూడా కరోనా వైరస్‌ పెద్ద సంక్షోభమని కెనడా ఓఐసీ సభ్యుడు హేలీ వికెనీసర్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-03-19T09:58:08+05:30 IST