Tokyo Olympics: విశ్వక్రీడలపై కరోనా నీడ..ఇద్దరు అథ్లెట్లకు పాజిటివ్!

ABN , First Publish Date - 2021-07-18T21:02:08+05:30 IST

ఒలింపిక్స్ క్రీడలపై కరోనా నీడ క్రమంగా విస్తరిస్తోంది. ఒలింపిక్స్ విలేజ్‌లో ఉంటున్న మరో ఇద్దరు అథ్లెట్లు కరోనా బారిన పడ్డట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Tokyo Olympics: విశ్వక్రీడలపై కరోనా నీడ..ఇద్దరు అథ్లెట్లకు పాజిటివ్!

టోక్యో: ఒలింపిక్స్ క్రీడలపై కరోనా నీడ క్రమంగా విస్తరిస్తోంది. ఒలింపిక్స్ విలేజ్‌లో ఉంటున్న మరో ఇద్దరు అథ్లెట్లు కరోనా బారిన పడ్డట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. అక్కడి సహాయక సిబ్బందిలో ఒకరు కరోనా బారినపడ్డట్టు వెల్లడైన మరుసటి రోజే ఇద్దరు క్రీడాకారులు పాజిటివ్‌గా తేలడం ప్రస్తుతం ఒలింపిక్స్ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఘటనపై టోక్యో ఒలింపిక్స్ ప్రతినిధి మాసా టకాయా స్పందించారు. ‘‘కరోనా బారిన పడ్డ ఈ ముగ్గురూ ఒకే దేశానికి చెందిన వారు. అంతేకాకుండా..ఒకే క్రీడకు సంబంధించిన వారు కూడా. వారిని ప్రస్తుతం వారి గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉంచాం. వారి బృందానికి చెందిన ఇతర సభ్యులను కూడా పరీక్షించాం’’ అని ప్రతినిధి తెలిపారు. కానీ టీం వివరాలను మాత్రం వెల్లడించలేదు. క్రీడాకారుల విడిది కోసం సిద్ధం చేసిన క్రీడా గ్రామంలో ఏకంగా 6700 మంది అథ్లెట్లు, అధికారులు, సహాయక సిబ్బంది నివసించేందుకు అవకాశం ఉంది.

Updated Date - 2021-07-18T21:02:08+05:30 IST