బరోడా నుంచి బీజేపీ అభ్యర్థిగా ఒలింపియన్ యోగేశ్వర్ దత్

ABN , First Publish Date - 2020-10-16T11:43:40+05:30 IST

హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ప్రముఖ క్రీడాకారుడిని ఎన్నికల బరిలోకి దించింది....

బరోడా నుంచి బీజేపీ అభ్యర్థిగా ఒలింపియన్ యోగేశ్వర్ దత్

చండీఘడ్ (హర్యానా): హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ప్రముఖ క్రీడాకారుడిని ఎన్నికల బరిలోకి దించింది. బరోడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఒలింపియన్ యోగేశ్వర్ దత్ ను రంగంలోకి దించింది. ఒలింపిక్ మెడల్ సాధించిన ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ సోనిపట్ జిల్లాలోని బరోడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నవంబరు 3వతేదీన జరగనున్న ఉప ఎన్నిక కోసం యోగేశ్వర్ దత్ శుక్రవారం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించనున్నారు. బరోడా ఎమ్మెల్యేగా 2019లో యోగేశ్వర్ దత్ పై విజయం సాధించిన శ్రీ కిృషన్ హుదా మరణించడంతో ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు. 


గురువారం హర్యానా సీఎం ఖట్టర్ ను ప్రముఖ క్రీడాకారులు బబితా ఫొగట్, సాక్షిమాలిక్, గీతా ఫొగట్, యోగేశ్వర్ దత్ లు కలిశారు. క్రీడాకారులతో చర్చించి ఎట్టకేలకు యోగేశ్వర్ దత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. సోనిపట్ జిల్లాలోని భైంసావల్ కలాన్ గ్రామానికి చెందిన యోగేశ్వర్ దత్ రెజ్లర్. క్రీడాకారుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.2013లో పద్మశ్రీ అవార్డు పొందిన దత్ 2012లో ఒలింపక్ పతకం, 2014లో కామన్ వెల్త్ గేమ్స్ లలో బంగారు పతకం సాధించారు.

Updated Date - 2020-10-16T11:43:40+05:30 IST