ఆయనకు 65, ఆమెకు 49.. కరోనాపై గెలిచిన ఈ భార్యాభర్తలేం చెప్తున్నారంటే..

ABN , First Publish Date - 2020-04-09T16:43:16+05:30 IST

అప్పటివరకు వింటున్న మాటే...పొరుగు దేశం, రాష్ట్రం...జిల్లాల్లో కేసులు నమోదవుతుండడంతో కొంత ఆందోళన. ఈ నేపథ్యంలో జిల్లాలో తొలి కేసు...తెలియని అలజడి. మక్కాకు వెళ్లి వచ్చిన ఓ వృద్ధుడు కరోనా వైరస్‌ బారినపడ్డారన్న సమాచారంతో నగరం ఉలిక్కిపడింది.

ఆయనకు 65, ఆమెకు 49.. కరోనాపై గెలిచిన ఈ భార్యాభర్తలేం చెప్తున్నారంటే..

వైరస్‌ బారినపడి కోలుకున్న విశాఖ దంపతులు.. డిశ్చార్జి చేసిన వైద్యులు

భయపడితే ఏ మందులూ పనిచేయవు

ధైర్యవంతుడిని కావడంతో వైరస్‌ సోకిందని తెలిసినా పెద్దగా ఆందోళన చెందలేదు

కానీ నావల్ల నా భార్యకు సోకిందని తెలిసినప్పుడు బాధపడ్డా..

ఎవరైనా అనుమానిత లక్షణాలుంటే తక్షణం పరీక్షలు చేయించుకోవాలి

లేదంటే కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వాళ్లం అవుతాం...

ఆయనకు 65, ఆమెకు 49... విశాఖ జిల్లాలో నమోదైన తొలి రెండు కేసులు వీరివే

ఆత్మస్థైర్యమే అసలైన మందు.. నగరంలో తొలి కరోనా బాధితుడు

వైరస్‌ సోకినంత మాత్రాన చచ్చిపోతామనుకోవద్దు...

సకాలంలో వైద్యం పొందితే క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చు

ఇందుకు మేమే నిదర్శనం...

ఆయన డిశ్చార్జి అయి వెళ్లిపోయిన రోజు బాగా ఏడ్చా

వైరస్‌ నుంచి కోలుకున్న మహిళ


విశాఖపట్టణం (ఆంధ్రజ్యోతి): అప్పటివరకు వింటున్న మాటే...పొరుగు దేశం, రాష్ట్రం...జిల్లాల్లో కేసులు నమోదవుతుండడంతో కొంత ఆందోళన. ఈ నేపథ్యంలో జిల్లాలో తొలి కేసు...తెలియని అలజడి. మక్కాకు వెళ్లి వచ్చిన ఓ వృద్ధుడు కరోనా వైరస్‌ బారినపడ్డారన్న సమాచారంతో నగరం ఉలిక్కిపడింది. బాధితులున్న జిల్లాల జాబితాలో విశాఖ కూడా చేరింది. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అతని భార్య కూడా వైరస్‌ బారినపడ్డారన్న సమాచారం మరింత సంచలనమైంది. ఆయనకు 65 ఏళ్లు. ఆమెకు 49 ఏళ్లు. దంపతులు ఇద్దరూ వైరస్‌ బారినపడ్డారన్న సమాచారం ఎంతటి సంచలనానికి కారణమైందో, వారిద్దరూ క్షేమంగా కోలుకున్నారన్న సమాచారం కూడా అంత సంతోషాన్నిచ్చింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వీరిద్దరినీ ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో పలకరించింది. వివరాలు వారి మాటల్లోనే...


విశాఖ నగరంలోని డాల్ఫిన్‌ సెంటర్‌లో చెప్పుల దుకాణం నడిపే వాడిని. వయసు పైబడడంతో వ్యాపారం మానేసి ఇంటికే పరిమితమయ్యాను. దీంతో మక్కా యాత్రకు వెళ్లమని నా భార్య ప్రోత్సహించింది. వీసా, పాస్‌పోర్టు వచ్చాక 15 రోజుల ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్‌ మీదుగా మక్కా, మదీనా వెళ్లాను. యాత్ర పూర్తి చేసుకుని మార్చి పదో తేదీన తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నా. అక్కడ వున్న మా అమ్మాయి ఇంట్లో రెండురోజులు వుండి 12న విశాఖ వచ్చాను. వచ్చినప్పటి నుంచి నీరసంగా వుండడంతో వైద్యం కోసం వెళితే వైరస్‌ సోకిందని చెప్పారు. అప్పటికే చాలాసార్లు అనారోగ్యం బారినపడడంతో ఇదీ అటువంటిదే అనుకుని ఆందోళన చెందలేదు. 14 రోజులు ఆసుపత్రిలో వుండాలని తీసుకువెళ్లారు. భోజనం ఇబ్బంది అయ్యింది. ఇంట్లో రోజూ నాన్‌వెజ్‌ అలవాటు. ఆసుపత్రి భోజనం నచ్చేది కాదు. ఆసుపత్రిలో వుండలేక పది రోజుల తర్వాత ఇంటికి పంపించేయాలని అడిగాను. మరో నాలుగు రోజుల్లో వెళ్లిపోదురుగాని అని చెప్పారు. వైరస్‌ నివారణకు, షుగర్‌కు మందులు ఇచ్చేవారు. వైద్యులు, పిల్లలు ధైర్యం చెప్పేవారు. రెండుసార్లు నెగెటివ్‌ రిపోర్టు వచ్చాక 20 రోజుల తర్వాత మీరు ఇంటికి వెళ్లిపోవచ్చునని వైద్యులు చెప్పినప్పుడు చాలా ఆనందించా. ఇప్పుడు నచ్చిన నాన్‌వెజ్‌ తింటూ ఇంట్లోనే ఉంటున్నా.  


ఆత్మస్థైర్యమే అసలైన మందు

వైరస్‌ బారినపడితే వైద్యం కంటే ఆత్మస్థైర్యమే అసలైన మందు. భయపడితే ఏ మందులు పనిచేయవు. తొలి నుంచీ కాస్త ధైర్యవంతుడిని కావడంతో వైరస్‌ సోకిందని తెలిసినా పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ నావల్ల నా భార్యకు సోకిందని తెలిసినప్పుడు బాధపడ్డా. అందువల్ల ఎవరైనా అనుమానిత లక్షణాలుంటే తక్షణం పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే తెలిసి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వాళ్లం అవుతాం.


మోదీ చెప్పినట్టు వినండి

వైరస్‌ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఈ వైరస్‌ బారిన ఎలా పడతామో తెలియదు కాబట్టి ప్రధాని మోదీ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండండి. లాక్‌డౌన్‌ పక్కాగా పాటించండి. అది ఒక్కటే మనందరికీ రక్ష. పది మందిలో తిరిగితే అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. మనతోపాటు కుటుంబం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా వుంటే మనల్ని ఏ వైరస్‌ దరిచేరదు.  


ఆయన డిశ్చార్జి అయి వెళ్లిపోయిన రోజు బాగా ఏడ్చా: కరోనా నుంచి కోలుకున్న మహిళ

ఆరోగ్యంగా వున్నప్పుడే యాత్రలు పూర్తి చేసుకుంటే బాగుంటుందని మా వారిని మక్కా యాత్రకు పంపింది నేనే. దగ్గరుండి పాస్‌పోర్టు చేయించా. మక్కా నుంచి వచ్చిన తరువాత పండగ చేసి నిరుపేదలు, చిన్నారులకు భోజనం పెట్టాలని అనుకున్నాం. కానీ తిరిగి వచ్చాక భోజనం చేయక పోవడం, నీరసంగా ఉండడంతో గమనించి దగ్గరలో వున్న ఆసుపత్రికి తీసుకువెళ్లా. అక్కడి వైద్యులు ఛాతీ ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా చెప్పారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్‌ బారినపడినట్టు చెప్పారు. మక్కా నుంచి ఇంటికి వచ్చిన తరువాత పండగ చేద్దామని అనుకున్నాం. వైరస్‌ సోకిందని తెలిసి తీవ్ర ఆందోళన చెందాం. నాకు కూడా సోకిందని తెలిసి ఆసుపత్రికి తరలిస్తుంటే భయం వేసింది. ఇద్దరం క్షేమంగా బయటపడడం ఆనందంగా ఉంది.


నిద్రరాక టాబ్లెట్‌ వేసుకునేదాన్ని

వైరస్‌ సోకిన తరువాత పది రోజులపాటు ఛాతీ ఆసుపత్రిలో, ఆ తరువాత గీతం ఆసుపత్రిలో ఉంచారు. ఉదయం, సాయంత్రం రెండు రకాల మాత్రలు పది రోజుల పాటు ఇచ్చారు. ఒంటరిగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. నిద్రపట్టేది కాదు. దీంతో డాక్టర్లు నిద్రపోయేందుకు టాబ్లెట్‌ ఇచ్చేవారు. మా అమ్మాయి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పేది. ఆమె వంట గది ముఖం ఎప్పుడూ చూసింది లేదు. దీంతో ఫోన్‌ లో మా ఇద్దరినీ అడిగి వంట చేసుకునేది. బిడ్డ కష్టపడుతుంటే చాలా బాధపడేదాన్ని.


జ్వరం వచ్చేది 

ఆసుపత్రిలో చేరిన మొదట్లో జ్వరం మాత్రమే వచ్చేది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు, బంధువులు ఫోన్‌ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పేవాళ్లు. మిగిలిన సమయంలో అల్లాను ప్రార్థించేదాన్ని. నాకంటే  ముందు ఆయన డిశ్చార్జి అయ్యారు. ఆరోజు ఒంటరిగా ఫీలై చాలా ఏడ్చాను. నేను ఆసుపత్రి నుంచి బయటపడతానో లేదోనని చాలా భయపడ్డాను. నేను ఏడుస్తుంటే పాప ధైర్యం చెప్పేది. అప్పాకు షుగర్‌, బీపీ ఉన్నాయి. అయినా క్షేమంగా ఇంటికి వచ్చారు. నువ్వు కూడా వచ్చేస్తావు. భయపడవద్దు’ అని పాప చెబుతుంటే ధైర్యం తెచ్చుకునేదాన్ని. 


భోజనంతో ఇబ్బంది

ఆసుపత్రిలో ఉదయం ఇడ్లీ, పాలు (ఛాతీ ఆసుపత్రిలో), గుడ్డు ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నం, రాత్రికి మూడు చపాతీలు, దద్దోజనం, కూరతో కూడిన భోజనం అందించేవాళ్లు. అయితే, భోజనం తినబుద్ధి అయ్యేది కాదు. తప్పనిసరిగా ఏదో తినాలని తినేదాన్ని. మనసంతా వికారంగా ఉండేది. 


అల్లాకు కోటి నమస్కారాలు

నేను చిన్నప్పటి నుంచి పిరికిదాన్ని. ప్రతిదానికి విపరీతంగా భయపడుతుంటా. వైరస్‌ వచ్చిన తరువాత అ లానే భయపడ్డా. వైద్యులు, కుటుంబ సభ్యులు ధైర్యంగా వుండాలని చెప్పేవాళ్లు. దాంతో కొంతవరకు సాధారణ స్థితికి వచ్చా. వైరస్‌ బారిన పడినవాళ్లు ఎవరైనా భయ పడకుండా ధైర్యం గా చికిత్స తీసుకుంటే ఇంటికి క్షేమంగా వెళ్లొచ్చు. వైరస్‌ సోకినంత మాత్రానా చచ్చిపోతామనుకోవద్దు. సకాలం లో వైద్యం పొందితే క్షేమంగా ఇంటికి చేరుకోగలం. ఇందుకు మేమే నిదర్శనం.

Updated Date - 2020-04-09T16:43:16+05:30 IST