ప్రభుత్వంపై గెలిచిన వృద్ధురాలు

ABN , First Publish Date - 2022-01-31T01:54:41+05:30 IST

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. అన్న సత్యాన్ని నమ్మిన ఆ వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయంపై పోరాటం మొదలుపెట్టింది.

ప్రభుత్వంపై గెలిచిన వృద్ధురాలు

నెల్లూరు: పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. అన్న సత్యాన్ని నమ్మిన ఆ వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయంపై పోరాటం మొదలుపెట్టింది. రాజకీయ కక్షలతో తొలగించిన తన పింఛన్‌ను న్యాయపరంగా పోరాడి సాధించుకుంది. అన్యాయంగా తన పింఛన్‌ను తొలగించారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ అధికారీ స్పందించలేదు. చివరకు హైకోర్టు మెట్లెక్కి ప్రభుత్వంపై పోరాడింది. అంతిమంగా 22 నెలల పాటు తనకు నిలిపేసిన పింఛన్‌ మొత్తాన్ని కూడా తిరిగి రాబట్టుకొని అందరి చేత శభాష్‌ అనిపించుకుంటోంది కాకర్ల సరోజనమ్మ. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల కాకర్ల సరోజనమ్మకు 2019 నుంచి పింఛన్‌ అందుతోంది. అంతకుముందు ఆమె భర్త పింఛన్‌ తీసుకుంటుండగా ఆయన మరణించిన తర్వాత ఆ పింఛన్‌ సరోజనమ్మకు వస్తోంది. సరోజనమ్మ కుటుంబం మొదటి నుంచీ టీడీపీ సానుభూతిపరులు. సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ కక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. 


ఈ క్రమంలోనే సరోజనమ్మ పింఛన్‌ను ఎటువంటి నోటీసులు లేకుండా 2020, జనవరి నుంచి నిలిపేశారు. తనకెందుకు పింఛన్‌ ఇవ్వడం లేదని ఆ వృద్ధురాలు అధికారులను ప్రశ్నించగా ఆమెకు 24 ఎకరాల భూమి ఉన్నట్లు సమాధానమిచ్చారు. అయితే తనకు కేవలం 4.90 ఎకరాల మెట్ట భూమి మాత్రమే ఉందని, అంతకుమించి ఒక్క సెంటు కూడా భూమి లేదని సరోజనమ్మ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగలేదు. ఈ పరిస్థితిని చూసి ఆవేదన చెందిన వృద్ధురాలు సరోజనమ్మ అధికారులపై పోరాటానికి నడుం బిగించింది. తనకు జరిగిన అన్యాయంపై గతేడాది అక్టోబరులో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని విచారించిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. సరోజనమ్మ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం నెల రోజుల్లోపు పింఛన్‌ను పునరుద్ధరించాలని తీర్పునిచ్చింది. 

Updated Date - 2022-01-31T01:54:41+05:30 IST