తమ్ముడే.. కాలయుముడై

ABN , First Publish Date - 2021-04-10T05:49:42+05:30 IST

జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. ఆస్తి వివాదం.. రక్తసంబంధం మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదాల కారణంగా.. సొంత తమ్ముడే ఆమెను రోకలిబండతో మోది హతమార్చాడు. శ్రీకాకుళం బలగలోని కుమ్మరవీధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

తమ్ముడే.. కాలయుముడై

శ్రీకాకుళంలో వృద్ధురాలి హత్య!

ఆస్తి వివాదమే కారణం

గుజరాతీపేట, ఏప్రిల్‌ 9: జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. ఆస్తి వివాదం.. రక్తసంబంధం మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదాల కారణంగా.. సొంత తమ్ముడే ఆమెను రోకలిబండతో మోది హతమార్చాడు. శ్రీకాకుళం బలగలోని కుమ్మరవీధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి  సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎచ్చెర్ల మండలం పెద్దకొంగరాంకు చెందిన మక్క అమ్మాయమ్మ(70) హత్యకు గురైంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట శ్రీకాకుళం బలగలోని కుమ్మరవీధిలో నివాసం ఉంటున్న తమ్ముడు, అల్లుడైన చిట్టి ప్రసాద్‌ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. అనంతరం ఆస్తి పంపకం విషయమై ప్రసాద్‌, అమ్మాయమ్మల మధ్య మాటామాటా పెరిగింది. వివాదానికి దారి తీసింది. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో అమ్మాయమ్మ మోకాళ్లపై ప్రసాద్‌ రోకలిబండతో బలంగా మోదాడు. దీంతో ఆమె మోకాళ్లు విరిగి.. ఎముకలు బయటకు వచ్చాయి. తీవ్ర రక్తస్రావంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. బంధువులు వెంటనే ఆమెను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)కి తరలించారు. అప్పటికే అమ్మాయమ్మ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. జీజీహెచ్‌ అవుట్‌ పోస్టు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చిట్టి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ పి.వెంకటరమణ తెలిపారు. ఇదిలా ఉండగా, చిట్టి ప్రసాద్‌ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అమ్మాయమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమార్తెను తన తమ్ముడు చిట్టి ప్రసాద్‌కు ఇచ్చి గతంలో వివాహం చేసింది. పిల్లలందరికీ వివాహమైన తర్వాత తన పేరున ఉన్న ఆస్తిని అమ్మాయమ్మ పంచి పెట్టింది. తనకు ఇచ్చిన ఆస్తి విలువ తక్కువని అమ్మాయమ్మతో చిట్టి ప్రసాద్‌ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను హతమార్చాడు. 


భార్య హత్య కేసులో జీవిత ఖైదు

హిరమండలం, ఏప్రిల్‌ 9: హిరమండలం మండలం గార్లపాడు గ్రామానికి చెందిన పల్లి గడ్డెన్నాయుడు (81)కు భార్య హత్యకేసులో జీవిత ఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్‌ జడ్జి టి.వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... నిందితుడు మొదటి భార్య తో విడాకులైన తరువాత ఎం.అవలింగికి చెం దిన కొవగాపు సత్యనారాయణ కుమార్తె లీలావతిని 1993లో వివాహం చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు తారతమ్యం ఉండడంతో లీలావతిపై అనుమానంతో తరచూ ఆమెను కొట్టి వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2013 అక్టోబర్‌ 15న రాత్రి సుమారు 8గంటల సమయంలో  ఆమెను సైకిల్‌ చైను చక్రం, ఇనుప రాడ్డుతో తయారు చేసిన పరికరంతో కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ మేరకు బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఏఎస్‌ఐ వి.బాలరాజు కేసు నమోదు చేయగా, అప్పటి పాలకొండ సీఐ ఎస్‌హెచ్‌ విజయానంద్‌ కేసు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఐ జె.శ్రీనివాసరావు చార్జిషీట్‌ ఫైల్‌ చేయగా కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెట్ట మల్లేశ్వరరావు వాదించారు. తుది విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం గడ్డెన్నాయుడుకు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చా రని ఎస్‌ఐ చెప్పారు. జరిమానా కట్టలేని ఎడల మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆ తీర్పులో పేర్కొన్నారని తెలిపారు.  

Updated Date - 2021-04-10T05:49:42+05:30 IST