రిక్షావాలాకు యావదాస్తినీ రాసిచ్చేసిన మహిళ

ABN , First Publish Date - 2021-11-14T03:18:03+05:30 IST

నా బంధుమిత్రులెవరూ నన్ను పట్టించుకోలేదు. ఒంటరిదాన్ని అయ్యాను. కానీ బుద్ధ నాకు అన్ని వేళలా అండగా ఉన్నాడు. పైగా ఆ కుటుంబం మాకెంతో కాలంగా సేవలు చేస్తోంది. నా బంధుమిత్రులకు చాలినంత ఆస్తులు ఉన్నాయి..

రిక్షావాలాకు యావదాస్తినీ రాసిచ్చేసిన మహిళ

భుబనేశ్వర్: అన్నీ కోల్పోయిననాడు అయినవారెవరూ ఉండరనే సామెత ఒకటుంది. ఇది ఒక్కోసారి నిజమేనని అనిపిస్తుంటుంది. అలా ఓ వృద్ధ మహిళకు అనిపించింది. అంతే.. తనకున్న మొత్తం ఆస్తిని ఒక రిక్షావాలకు రాసిచ్చేంది. కోర్ట్ పేపర్ మీద సంతకం పెట్టి చట్టబద్ధంగా తన ఆస్తిని సదరు రిక్షావాలకు బదలాయిస్తున్నట్లు, తన మరణాంతరం అతడిని కానీ అతడి కుటుంబాన్ని వేధించరాదని హెచ్చరించింది.


ఒడిశాలోని కటక్ పట్టణంలో జరిగిందీ సంఘటన. వృద్ధ మహిళ పేరు మినాటి. రిక్షా పుల్లర్ పేరు బుద్ధ సమాల్. మినాటి భర్త ఆరు నెలల క్రితం కొవిడ్ కారణంగా మరణించారు. అనంతరం కొద్ది రోజులకు కూతురు గుండెపోటుతో మరణించింది. ప్రాణంగా ప్రేమించిన వారిని కోల్పోయిన మినాటిని అయినవారెవరూ పలకరింపుకు కూడా రాలేదు. కనీసం ఫోన్ చేసినా తీయలేదు. దీంతో తమ కుటుంబానికి ఎంతో కాలంగా సహాయంగా ఉంటున్న బుద్ధ సమాల్‌కు మూడు అంతస్థుల బంగళాతో పాటు బంగారు ఆభరణాలు, ఇతర మొత్తం ఆస్తిని రాసిచ్చేంది.


‘‘నా బంధుమిత్రులెవరూ నన్ను పట్టించుకోలేదు. ఒంటరిదాన్ని అయ్యాను. కానీ బుద్ధ నాకు అన్ని వేళలా అండగా ఉన్నాడు. పైగా ఆ కుటుంబం మాకెంతో కాలంగా సేవలు చేస్తోంది. నా బంధుమిత్రులకు చాలినంత ఆస్తులు ఉన్నాయి. అందుకే 25 ఏళ్లుగా మా కుటుంబానికి సహాయంగా ఉన్న ఈ నిరుపేద రిక్షావాలాకు నా ఆస్తిని స్వచ్ఛందంగా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని మినాటి తెలిపారు. కాగా బుద్ధ స్పందిస్తూ ‘‘నాకు ఆస్తి తీసుకోవాలనే ఉద్దేశం లేదు. కానీ మిటాని గారు ఆమె భర్త మరణాంతరం చాలా కుంగిపోయారు. మా కుటుంబం ఎప్పుడూ ఆమె గురించి ఆలోచిస్తుంది. ఆమె బతికి ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవడమే మా కర్తవ్యం’’ అని పేర్కొన్నాడు.

Updated Date - 2021-11-14T03:18:03+05:30 IST