ఊరు పొమ్మంది... పడవే ఆశ్రయమైంది....

ABN , First Publish Date - 2020-04-03T21:26:53+05:30 IST

కరోనా తన విషపు కోరలను చాటడంతో దేశం దేశమే విలవిల్లాడిపోతోంది. మనిషికీ మనిషీకి మధ్య ‘అనుమానం’ పెరిగిపోతోంది. దూరమూ.

ఊరు పొమ్మంది... పడవే ఆశ్రయమైంది....

కోల్‌కత్తా : కరోనా తన విషపు కోరలను చాచడంతో దేశం దేశమే విలవిల్లాడిపోతోంది. మనిషికీ మనిషీకి మధ్య ‘అనుమానం’ పెరిగిపోతోంది. దూరమూ... ఇక చెప్పక్కర్లేదు. మామూలు అనారోగ్యం సోకినా... దానినీ ప్రబుద్ధులు ‘కరోనా వైరస్’ లెక్కల్లో వేసేసి సాటి మనుషులను ఘోరంగా అవమానిస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తలు తప్పనిసరే కానీ... అనుమానంతో ప్రజలను ఇబ్బందిపెట్టేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీప్ అనే గ్రామంలో నిరంజన్ హల్దార్ అనే వ్యక్తికి కాస్త అనారోగ్యంతో జ్వరం వచ్చింది.


దీంతో 14 రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారు. గ్రామస్థులు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని అతనిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు... ఊళ్లోకి  రాకూడదని ఏకంగా శాసనం చేశారు. దీంతో అతనికి ఏమీ తోచక గత ఐదు రోజులుగా చిన్న కాలువలోని  పడవలోనే జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన హబీద్‌పూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో గ్రామంలోకి ప్రజలు రాకూడదని తేల్చి చెప్పారు. గ్రామంలోకి వస్తానని ఆయన గ్రామస్థులను వేడుకోగా... అందుకు వారు ససేమిరా అంగీకరించడం లేదు. దీంతో ఆయన పడవలోనే నివసిస్తున్నాడు.


‘‘కోవిడ్ - 19 వ్యాప్తి తర్వాత నేను జ్వరంతో బాధపడుతున్నా. గ్రామస్థులు గ్రామంలోకి రానివ్వడం లేదు. వైద్యులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సలహా ఇచ్చారు. ఏం చేయాలో తోచక నేను పడవలోనే నివసిస్తున్నా’’ అని హల్దార్ తెలిపారు. మరోవైపు దీనిపై స్థానిక అధికారులు స్పందించారు. కరోనా వైరస్ కారణంగా ఈయన కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశామని, భోజనాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-04-03T21:26:53+05:30 IST